బిగ్ బాంబ్- నీట్ యూజీ పరీక్ష రద్దు
లక్షలాది మంది విద్యార్థులకు బిగ్ షాక్ తగిలింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG 2026) పరీక్ష రద్దయింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేసినట్లు వెల్లడించింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటించి, తిరిగి పరీక్ష నిర్వహిస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. పేపర్ లీక్ కావడం, పరీక్షా ప్రక్రియలో లోపాలున్నాయని తేలడమే ఈ నిర్ణయానికి కారణం.
రాజస్థాన్ లో పేపర్ లీక్ అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 3వ తేదీన పరీక్షలు జరగ్గా.. 8న దీనిపై విచారణను కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల అప్పగించింది ప్రభుత్వం. ప్రస్తుత పరీక్షల విధానం ఆమోదయోగ్యం కాదని సీబీఐ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో నీట్ యూజీ పరీక్ష మొత్తాన్నీ రద్దు చేసింది ఎన్టీఏ. ఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించింది. నూతన పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.

పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయతను కాపాడేందుకు ఈ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ వివరించింది. విద్యార్థులు ఈ విషయంలో ఎటువంటి పుకార్లను విశ్వసించవద్దని, అధికారిక సమాచారంపై మాత్రమే ఆధారపడాలని విజ్ఞప్తి చేసింది. నీట్ పేపర్ లీక్ కేసుపై తొలుత రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ విస్తృత దర్యాప్తు చేపట్టింది. ఇప్పటివరకు 45 మందికి పైగా వ్యక్తులు అదుపులో ఉన్నారు. ఈ కేసులో పలు రాష్ట్రాల్లో సోదాలు, విచారణ కొనసాగుతున్నాయి. కొందరు అరెస్ట్ కూడా అయ్యారు.
కాగా ఈ ఏడాది నీట్ పరీక్షకు దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పుడు వారందరూ కూడా మరో విడత పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేపర్ లీక్ వ్యవహారంలో రెండు కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. ఒకటి.. ప్రశ్నాపత్రం ప్రింటింగ్ సమయంలో లీక్ అయి ఉండొచ్చు. రెండవది.. ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసే వ్యక్తులు దీన్ని లీక్ చేసి ఉండవచ్చు అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఈ లీక్ వివాదానికి మూలం ఒక గెస్ పేపర్.. అంటే ఊహాజనితంగా రూపొందించిన ప్రశ్నాపత్రం అని భావిస్తోన్నారు. పరీక్షకు ముందు విద్యార్థులకు చేరిన ఈ గెస్ పేపర్‌లో పొందుపరిచిన 720 మార్కుల సుమారు 600 మార్కుల ప్రశ్నలు అసలు పరీక్షతో సరిగ్గా సరిపోలాయి. ఇది లక్షలాది మందిలో ఆందోళన నింపింది. దీని తీవ్రత నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి అందిన సమాచారం ఆధారంగా డెహ్రాడూన్, సికార్, ఝున్‌ఝున్‌లలో 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది.
వీరిలో సికార్‌లోని ఒక ప్రముఖ కోచింగ్ సంస్థ కెరీర్ కౌన్సెలర్లు కూడా ఉన్నారు. పరీక్షకు రెండు రోజుల ముందే ఈ ఊహాజనిత ప్రశ్నపత్రం కొందరు విద్యార్థులకు చేరిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇది యాదృచ్ఛికమా లేక వ్యవస్థీకృత లీకేజీలో భాగమా అని కోణంలో దర్యాప్తు చేపట్టారు. గెస్ పేపర్ లో దాదాపు 410 ప్రశ్నలు ఉండగా వాటిలో 150 ప్రశ్నలు, మొత్తం 600 మార్కులకు సంబంధించినవి, నీట్ యూజీ 2026 అసలు పరీక్ష ప్రశ్నపత్రంతో సరిగ్గా సరిపోలాయని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications