Vijay-Udayanidhi: ఉదయనిధికి విజయ్ రిటర్న్ గిఫ్ట్..! అసెంబ్లీలో అరుదైన సన్నివేశం..!
తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ (Vijay) కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇప్పటికే సీఎంగా ప్రమాణస్వీకారానికి సంప్రదాయ పంచెకట్టును వదిలి సూటు, బూటులో వచ్చి ఆశ్చర్యపరిచిన విజయ్.. నిన్న విపక్ష డీఎంకే అధినేత స్టాలిన్ తో పాటు వైకో, అన్బుమణి రాందాస్ వంటి విపక్ష పార్టీల నేతల ఇళ్లకు వెళ్లి వారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవాళ అసెంబ్లీలో మరోసారి విజయ్ తన మార్కు ప్రదర్శించారు. కొత్త స్పీకర్ నియామకం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం సందర్భంగా విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) సంతకం చేయడానికి వచ్చి తన ముందు నిలబడి కూడా తనను చూడకపోయినా సీఎం విజయ్ మాత్రం ఆయన్నే చూస్తూ కనిపించారు. ఆ తర్వాత కూడా ఉదయనిధి విజయ్ ను చూడకుండానే అటు తిరిగి వెళ్లిపోయారు. కానీ నిన్న మాత్రం స్టాలిన్ ఇంటికి విజయ్ రాగానే ముందుగా ఎదురేగి ఆత్మీయ అలింగనం చేసుకుని మరీ స్వాగతం పలికిన ఉదయనిధికి ఇవాళ విజయ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.

అసెంబ్లీలో ఇవాళ కొత్త స్పీకర్ గా జేసీడీ ప్రభాకర్ ను నియమించిన విజయ్.. ఆయన్ను సగౌరవంగా కుర్చీలో కూర్చోబెట్టేందుకు పోడియానికి వెళ్లాల్సి ఉంది. అయితే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లేందుకు విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ముందుకొచ్చారు. ఆయనతో పాటు మంత్రి సెంగొట్టయాన్ కూడా వచ్చారు. సీఎం విజయ్ మాత్రం తన సీటు వద్దే నిలబడ్డారు. సీఎం గారిని కూడా పిలవాలని మంత్రి సెంగొట్టయాన్ కు విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కోరారు. దీంతో మంత్రి సెంగొట్టయాన్ సీఎం విజయ్ ను స్పీకర్ పోడియం వద్దకు ఆహ్వానించారు. కానీ తాను రాకుండా విపక్ష నేత అయిన ఉదయనిధిని స్పీకర్ వద్దకు పంపారు. తద్వారా తన కంటే విపక్ష నేతకే ఎక్కువ గౌరవం ఇవ్వడం ద్వారా రాజకీయాల్లో కొత్త సంప్రదాయనికి శ్రీకారం చుట్టినట్లయింది.













Click it and Unblock the Notifications