రూ.700 కోసం పదిమంది కలిసి హత్య.. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం!
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో చిల్లర డబ్బుల వివాదం ఒక వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకున్న సంఘటన లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడు రోజుల క్రితం మహ్మద్ హుస్సేన్ అలియాస్ వసీమ్ ఏసీ టెక్నీషియన్ హత్యకు గురయ్యారు.ఈ హత్యకేసును అత్తాపూర్ పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. కేవలం రూ.700 కోసం జరిగిన ఈ దారుణ హత్యలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
700 రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని దారుణం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెహిదీపట్నం లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ ఏసీ టెక్నీషియన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిందితులు గంజాయి కోసం హుస్సేన్ కు రూ.700 ఇచ్చారు. కానీ గంజాయి ఇవ్వకపోగా, డబ్బు తిరిగి అడిగితే హుస్సేన్ నిరాకరించారు. దీంతో వారు హుస్సేన్‌పై కక్ష పెంచుకున్నారు.

విచక్షణా రహితంగా దాడి చేసిన పదిమంది
మే 9న నిందితులు హుస్సేన్‌ను అత్తాపూర్‌లోని ఖుషీ ఫంక్షన్ హాల్ సమీపంలో అడ్డగించారు. అక్కడే విచక్షణారహితంగా కొట్టి, తర్వాత మరో ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న హుస్సేన్‌ను ఏజీ కాలేజీ మెయిన్ గేట్ వద్ద పడేసి పరారీ అయ్యారు. అత్తాపూర్ పోలీసులు వెంటనే హుస్సేన్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
ముగ్గురి అరెస్ట్, ఏడుగురి కోసం గాలింపు
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న అత్తాపూర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మొత్తం 10 మంది నిందితులను గుర్తించగా, ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. మిగిలిన 7గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుల వద్ద నుంచి వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి కోసమే ఇదంతా
ఈ ఘటన యువతలో గంజాయి వ్యసనం, చిన్న చిన్న వివాదాలు ఎంత దారుణ ఘటనలకు పాల్పడేలా చేస్తాయో అర్ధమయ్యేలా చెప్తుంది. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు పెరుగుతుండటం సమాజానికి ముప్పుగా మారుతోంది. పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనా గంజాయి కోసం ఏడు వందల రూపాయలు ఇచ్చామని ఒక వ్యక్తిని హతమార్చటం నిందితుల క్రిమినల్ నేచర్ కు అద్దం పడుతుంది.













Click it and Unblock the Notifications