ఎవరీ వీఎస్ బాబు- స్టాలిన్నే ఓడించాడు
తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. 210కు పైగా స్థానాల నుంచి అందిన తాజా ట్రెండ్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ తర్వాత, ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ప్రారంభం విజయ్ స్థాపించిన తమిళన వెట్రి కజగం పార్టీ దూకుడు కనిపించింది. దీర్ఘకాలంగా తమిళనాట పాతుకుపోయిన రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏఐఏడీఎంకేదీ అదే పరిస్థితి.
తమిళనాడు శాసనసభ ఎన్నికలు అనూహ్య ఫలితాలతో చరిత్ర సృష్టించాయి. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కొళత్తూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఘోర పరాజయం పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో స్టాలిన్ 8,000 ఓట్ల పైచిలుకు తేడాతో ఓటమిని చవిచూశారు. డీఎంకే మూడో స్థానానికి పరిమితం కావడం ఒక ఎత్తయితే, ఏకంగా స్టాలినే ఓడిపోవడం మరో ఎత్తు. స్టాలిన్ కు కంచుకోట ఈ కొళత్తూర్ నియోజకవర్గం.

ఆయనను ఓడించడంతో 75 ఏళ్ల వీఎస్ బాబు జెయింట్ కిల్లర్ అయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞుడు ఈ వీఎస్ బాబు. కొళత్తూరు ప్రాంతంలో ఆయనకు గట్టి పట్టు ఉంది. బలమైన రాజకీయ పలుకుబడి ఉంది. 2006లో డీఎంకే అభ్యర్థిగా పురసావల్కమ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి, ఏఐఏడీఎంకే అభ్యర్థిపై 90,000 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి నుంచే ఆయన పేరు తమిళ రాజకీయాల్లో వినిపిస్తూ వస్తోంది.
వీఎస్ బాబు తన రాజకీయ ప్రస్థానాన్ని డీఎంకేతో ప్రారంభించారు. పార్టీలో సాధారణ కార్యకర్తగా పనిచేసి, నార్త్ చెన్నై జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 2006 నుండి 2011 వరకు ఆయన శాసనసభ్యుడిగా సేవలు అందించారు. గతంలో స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఈ ఏడాది ఫిబ్రవరి 7న డీఎంకేను వీడారు. విజయ్ పార్టీ టీవీకేలో చేరారు. సరిగ్గా రెండు నెలల్లో స్టాలిన్ ను మట్టికరిపించారు. బాబు 82,997 ఓట్లు పొల్ కాగా, స్టాలిన్ కు 74,202 ఓట్లు పోల్ అయ్యాయి. 8,795 ఓట్ల మెజారిటీతో స్టాలిన్‌ను ఓడించారాయరన.
డీఎంకేలో అంతర్గత మార్పులు, పీకే శేఖర్‌బాబు వంటి సీనియర్ నాయకుల ఎదుగుదల వంటి పరిణామాలు సంస్థాగతంగా డీఎంకేలో వీఎస్ బాబు పాత్ర క్షీణించడానికి దారితీశాయి. చివరికి డీఎంకేను వీడాల్సొచ్చింది. డీఎంకేను వీడిన తర్వాత కొన్నాళ్ళు ఏఐఏడీఎంకేతో అనుబంధాన్ని కొనసాగించారు. అక్కడా ఇమడలేకపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి టీవీకేలో చేరారు. 2008 నుండి స్టాలిన్‌కు కంచుకోటగా ఉన్న కొళత్తూర్‌లో బాబు సాధించిన విజయం రాజకీయ ప్రకంపనలను సృష్టించింది.












Click it and Unblock the Notifications