గ్రేటర్ వరంగల్ వాసులకు కేంద్రం తీపికబురు!
కేంద్ర ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ కు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు చేర్చినట్టు పేర్కొంది. ఇటీవల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదించిన 5,257 కోట్ల రూపాయల ప్రతిపాదనలు మరియు సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపించగా, కేంద్రం దీనికి అంగీకారం తెలిపింది.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అమలు చేయడానికి రంగం సిద్ధం
ఈ మేరకు హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు గ్రేటర్ వరంగల్ ప్రత్యేకఅధికారి చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అమలు చేయడానికి రంగం సిద్ధమైంది. నిధుల విషయంలో స్పష్టత వచ్చింది. త్వరలోనే అధికారిక ఆదేశాలు జారీ అవుతాయని ప్రకటించారు. కమిషనర్ ఫర్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డా. టి.కే. శ్రీదేవి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై సమగ్ర సమీక్ష జరిగింది.

వరంగల్ నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త ఊపిరి
హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలెక్టరేట్ నుంచి పాల్గొని, ప్రాజెక్టు అమలు విధానాలు, నిధుల వినియోగం, సమగ్ర డీపీఆర్ తయారీపై వివరాలు చర్చించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నగరానికి నిధులు మంజూరు కావడం ద్వారా వరంగల్ నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్తఊపిరి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నగరంలో వర్షాకాలంలో వస్తున్న వరదనీటి సమస్యలు, మురుగునీటి సమస్యలు తగ్గుతాయి.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అత్యంత కీలకం
వరంగల్ నగరం త్వరగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అత్యంత కీలకం. ఈ ప్రాజెక్టు ద్వారా రోడ్లు, డ్రైనేజీ నెట్‌వర్క్‌ను ఆధునికీకరించి, ప్రజల సౌకర్యాన్ని మెరుగుపరచనున్నారు. కేంద్ర నిధులతో మున్సిపల్ సేవల నాణ్యత మరింత మెరుగుపడనుంది. ఈ అభివృద్ధి కార్యక్రమం వరంగల్ నగర ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications