ఆటో డ్రైవర్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన విజయ్.. డీఎంకే కంచుకోట బద్దలు
తమిళనాడులో విజయ్ ప్రభంజనం కొనసాగుతోంది. విజయ్ టీవీకే పార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో దూసుకెళ్తోంది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన టీవీకే పార్టీ 109 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. తమిళనాడులో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక టీవీకే పార్టీ తరఫున రోయపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆటో డ్రైవర్ విజయ్ ధాము సంచలన విజయం సాధించారు. శక్తివంతమైన డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థుల్ని వెనక్కు నెట్టి ఓ సాధారణ ఆటో డ్రైవర్ ఎమ్మెల్యేగా గెలవడం తమిళనాట రాజకీయాల్లో నూతన శకం అని చెప్పొచ్చు.
ఆటో డ్రైవర్ విజయ్ ధాముకు 55 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. దాంతో తన సమీప ప్రత్యర్థిపై దాదాపు 14 వేల మెజార్టీతో విజయ్ ధాము విజయం సాధించారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేత, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డి. జయ కుమార్ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేవలం ఆయనకు 14 వేల ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. దాంతో ఆయన మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక డీఎంకే అభ్యర్థి సుబైర్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు.

విజయ్ అభిమాన సంఘం అయిన విజయ్ మక్కల్ ఇయక్కంలో సుదీర్ఘకాలం విజయ్ ధాము పనిచేశారు. ఓవైపు ఆటో నడుపుతూనే మరోవైపు స్థానిక సమస్యలపై పోరాడారు. అలా ఇప్పుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆటో డ్రైవర్ నుంచి ఎమ్మెల్యేగా అతని ప్రయాణం చాలామందికి స్ఫూర్తిదాయకం. ఇక టీవీకే అధ్యక్షుడు విజయ్ పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు. పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన డీఎంకే అభ్యర్థి ఆర్ డీ శేఖర్ పై విజయం సాధించారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్ ఘోర ఓటమి పాలయ్యారు. కొలత్తూరు నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన ఆయన ఈ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. స్టాలిన్ పై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 9 వేల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications