పాకిస్థాన్ ప్రభుత్వం, ఆర్మీని లేపేస్తాం.. అల్ ఖైదా సంచలన వార్నింగ్..!
గత కొంతకాలంగా పాకిస్థాన్- అఫ్గానిస్తాన్ మధ్య దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అఫ్గానిస్తాన్ పై ఇటీవల పాకిస్థాన్ దాడులను వేగవంతం చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయిన అల్ ఖైదా పాకిస్థాన్ కు సంచలన వార్నింగ్ ఇచ్చింది. అఫ్గానిస్తాన్ ప్రభుత్వంలోని తాలిబాన్ ప్రభుత్వానికి తమ సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేసింది. పాకిస్థాన్ మిలిటరీ.. అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు సాహబ్ మీడియా ద్వారా రెండు పేజీల లేఖను విడుదల చేసింది. అలాగే పశ్చిమాసియా దేశాలతో పాకిస్థాన్ చనువుగా ఉండటం.. ఇరాన్- అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది అల్ ఖైదా.
అలాగే పాకిస్థాన్ ప్రభుత్వ ఆదేశాలను ఎవరూ పాటించొద్దని ప్రజలు, ఆర్మీకి కూడా పలు సూచనలు చేసింది అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ. అంతేకాక తమ జిహాదీ లక్ష్యాలకు మద్దతు ఇవ్వాలని కోరింది. ఇక పాకిస్థాన్ ప్రభుత్వం ప్రస్తుతం ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నేతృత్వంలో పాశ్చాత్య దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అల్ ఖైదా సంస్థ మండిపడింది. తాలిబాన్ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని.. అఫ్గానిస్తాన్ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ మేరకు లేఖలో స్పష్టం చేసింది.
పాకిస్థాన్- అఫ్గానిస్తాన్ సరిహద్దుగా డురాండ్ లైన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే డురాండ్ లైన్ విషయంలో పాకిస్థాన్- అఫ్గానిస్తాన్ మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి. పాకిస్థాన్ సైన్యం అఫ్గానిస్తాన్ భూభాగంలో వైమానిక దాడులకు పాల్పడుతుండగా అటు తాలిబన్లు కూడా పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు అల్ ఖైదా సంచలన వార్నింగ్ ఇవ్వడంతో అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఆ దేశంలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవుతోంది. పాకిస్థాన్ లో ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితులు ఉన్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అల్ ఖైదా నుంచి ఇలాంటి వార్నింగ్ రావడంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.












Click it and Unblock the Notifications