వెల్ కమ్: ఎట్టకేలకు చైనా, పాకిస్థాన్ కు భారత్ గుడ్ న్యూస్..!
దేశ భద్రత, ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో భారత్ పలు మార్పులు చేసింది. భారత్ సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ లపై ఓవైపు నిఘా పెంచుతూనే మరోవైపు ఆ దేశాలపై పలు సడలింపులు ఇచ్చింది. ఇంతకుముందు ఈ దేశాల నుంచి వచ్చే ప్రతి పెట్టుబడికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండేది. కానీ తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. ఈ దేశాలకు చెందిన వ్యక్తులు లేదా సంస్థల వాటా 10 శాతం లోపు ఉండి వారికి ఆ కంపెనీ నియంత్రణ అధికారం లేకపోతే అలాంటి పెట్టుబడులకు ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం లేదని కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీనిని ఆటోమెటిక్ రూట్ అని పిలుస్తుంటారు.
ఇక పాకిస్థాన్ కు సంబంధించిన పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. కీలక రంగాలైన డిఫెన్స్, స్పేస్, ఆటమిక్ ఎనర్జీ వంటి వాటిల్లో పాకిస్థాన్ నుంచి పెట్టుబడులు పూర్తిగా నిషేధించారు. అలాగే ఇతర ఏ రంగాల నుంచి పెట్టుబడులు పెట్టాలన్నా పాకిస్థాన్ నిధులకు కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ ఉండే విధంగా రూల్స్ ను మార్చారు. అలాగే భారత్ లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సోలార్ ప్యానెల్ తయారీ, బ్యాటరీ కాంపోనెంట్స్.. తదితర ఏడు కీలక రంగాల్లో వచ్చే పెట్టుబడుల దరఖాస్తులను 60 రోజుల్లోపు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ కంపెనీల నియంత్రణ మాత్రం భారతీయుల చేతుల్లోనే ఉండాల్సి ఉంది.

దాంతోపాటు పెట్టుబడులు పెట్టే సంస్థ వెనుక అసలు యజమాని ఎవరు..? అన్న దానిపై ప్రభుత్వం పలు నిబంధనల్ని తీసుకొచ్చింది. ఈ రూల్స్ కారణంగా నిధులు ఏ దేశం నుంచి వస్తున్నాయో స్పష్టత రానుంది. ఇక 2020 కొవిడ్-19 సంక్షోభం సమయంలో భారత్ లోని స్టార్టప్ కంపెనీలను చైనా తక్కువ ధరకు చేజిక్కించుకోకుండా భారత్ కఠినమైన నిబంధనల్ని తీసుకొచ్చింది. దానివల్ల చాలా స్టార్టప్ కంపెనీలకు నిధుల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ భద్రతకు ముప్పు వాటిల్లకుండా చిన్న చిన్న పెట్టుబడులు సులభంగా వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఫైర్ వాల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.












Click it and Unblock the Notifications