చమురు ఉత్పత్తి ఆపలేక, రవాణా చేయలేక..! ఇరాన్ ఏం చేస్తోందంటే ?
ప్రస్తుతం ఇరాన్ (Iran) చమురు పరిశ్రమ క్లిష్ట స్థితిలో ఉంది. ఖర్గ్ ద్వీపంలో చమురు ఉత్పత్తిని ఆపలేక ఓవైపు, ఎగుమతులు స్తంభించడంతో మరోవైపు ముడి చమురు నిల్వలు ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి. ఇరాన్ మొత్తం చమురు ఉత్పత్తిలో 90 శాతానికి పైగా లభించే ఖార్గ్ ద్వీపంలో, 30 మిలియన్ బ్యారెళ్ల నిల్వ సామర్థ్యం దాదాపు నిండిపోయింది. హార్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం దీనికి ప్రధాన కారణం.
దీంతో చమురు నిల్వల సమస్యను ఎదుర్కోవడానికి, ఇరాన్ తన 30 ఏళ్ల నాటి నషా (Nasha) అనే ట్యాంకర్‌ను తిరిగి వినియోగంలోకి తెస్తోంది. చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఈ నౌకను, ఇప్పుడు ఎగుమతి చేయలేని అదనపు ముడి చమురును సముద్రంలో నిల్వ చేయడానికి ఫ్లోటింగ్ స్టోరేజీగా మారుస్తున్నారు. ఈ తాత్కాలిక పరిష్కారం, దేశ చమురు మౌలిక సదుపాయాలపై US నౌకాదళ దిగ్బంధనం ఎంత తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుందో స్పష్టంగా సూచిస్తుంది.

మెరైన్ అనలిస్టులు గల్ఫ్ న్యూస్‌కు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం మరో 13 మిలియన్ బ్యారెళ్ల చమురుకు మాత్రమే నిల్వ సామర్థ్యం ఉంది. రోజుకు సుమారు 1 మిలియన్ నుండి 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలకు వచ్చి చేరుతోంది. ఈ రేటున చూస్తే, 12 నుండి 13 రోజుల్లో నిల్వ సామర్థ్యం పూర్తిగా నిండిపోతుందని వారు అంచనా వేస్తున్నారు. ట్యాంకర్‌ట్రాకర్స్ (TankerTrackers) అనే మెరైన్ ట్రాకర్ ప్లాట్‌ఫారమ్ అందించిన శాటిలైట్ చిత్రాల ప్రకారం, ఏప్రిల్ 16న ఇరాన్‌లోని ఖార్గ్ ద్వీపం ఎగుమతి టెర్మినల్ వద్ద మొత్తం 5 మిలియన్ బ్యారెళ్లతో మూడు ట్యాంకర్లు లోడ్ అవుతున్నట్లు కనిపించింది.

ఒకవేళ చమురు నిల్వ సామర్థ్యం పూర్తిగా నిండిపోతే, ఇరాన్‌కు కొన్ని ప్రత్యామ్నాయాలు మాత్రమే మిగిలి, తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిల్వ చేయలేని చమురును ఉత్పత్తి చేయలేరు, అలాగే ఎగుమతి చేయలేని చమురు టెహ్రాన్‌కు అవసరమైన ఆదాయాన్ని అందించదు. ఈ దిగ్బంధనం కేవలం సైనిక వ్యూహం మాత్రమే కాదు, ఇది ఇరాన్‌పై ఆర్థిక ఉచ్చుగా మారుతోంది. గతంలో, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ (Scott Bessent) ఇరాన్ త్వరలో తన ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని చేరుకోవచ్చని హెచ్చరించారు. చమురు నిల్వ చేయడానికి స్థలం కొరత ఒక ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే ఇరాన్ తన బావులను మూసివేయాల్సి వస్తుంది, ముఖ్యంగా వాటర్-ఇంజెక్షన్ క్షేత్రాలను నిలిపివేయడం మరింత సమస్యాత్మకం. ఈ క్షేత్రాలు నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే వాటికి తీవ్ర నష్టం జరిగి దీర్ఘకాలిక ఉత్పత్తి నష్టాలకు దారితీస్తుంది. చమురు, గ్యాస్ ఉత్పత్తిని ఒకసారి ఆపితే, నీటి ట్యాప్‌ను ఆపినంత సులువు కాదు అని నిపుణులు చెబుతున్నారు. ఇది సంక్లిష్టమైన, తరచుగా కోలుకోలేని ప్రక్రియ అవుతుంది.














Click it and Unblock the Notifications