Iran: చమురు మంటలే-తేల్చేసిన ఇరాన్- 200 డాలర్లకు బ్యారెల్..!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లో అమెరికా ఆస్తులపై దాడులకు దిగిన ఇరాన్.. ఇవాళ్టి నుంచి వ్యూహం మార్చింది. అమెరికా-ఇజ్రాయెల్ తో పాటు ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో హార్ముజ్ జలసంధిలో చమురు నౌకలపై దాడుల్ని తీవ్రతరం చేస్తోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు (crude oil)బ్యారెల్ కు 200 డాలర్లకు సిద్దమైపోవాలని ప్రపంచదేశాలకు ఇరాన్ హెచ్చరికలు చేసింది.
హర్ముజ్ జల సంధిలో చమురు నౌకల్ని టార్గెట్ చేస్తున్న ఇరాన్.. దీని వల్ల అంతర్జాతీయంగా పెరిగే చమురు ధరలకు ప్రపంచ దేశాలు సిద్దం కావాలని హెచ్చరికలు జారీ చేసింది. 1970ల తర్వాత అత్యంత దారుణమైన చమురు షాక్‌లలో ఒకటిగా భావిస్తున్న ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ వ్యూహాత్మక నిల్వలను భారీగా విడుదల చేయాలని సిఫార్సు కూడా చేసింది. ప్రస్తుతం ఈ యుద్దం ఇరాన్ ను దాటి లెబనాన్ లోకి కూడా విస్తరించిన నేపథ్యంలో తాజా హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఓవైపు ఇరాన్ పని అయిపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పేస్తున్న వేళ.. ఆ దేశం మాత్రం తీవ్ర ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులే ఇందుకు నిదర్శనం. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తమ ఆదేశాలను ధిక్కరించిన ఓడలపై కాల్పులు జరిపినట్లు ప్రకటించారు. మరోవైపు హార్ముజ్ జలసంధిపై అమెరికా పట్టు సాధిస్తోందని ట్రంప్ చెబుతున్నా క్షేత్రస్దాయిలో పరిస్ధితులు భిన్నంగా ఉన్నాయి. ఈ జలసంధి ద్వారా ఓడలు సురక్షితంగా ప్రయాణించే అవకాశాలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications