ఆర్టీసీ సమ్మె వేళ ఫిట్‌మెంట్ పెంపు, విలీనం పై కీలక నిర్ణయం..!?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె సామాన్య ప్రయాణీకులకు సమస్యగా మారుతోంది. ఆర్టీసీ జేఏసీ నేతలు తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె ఆగదని తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల పైన ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. అందులో భాగంగా ఉద్యోగులకు ఫిట్‌మెంట్ తో పాటుగా పని వేళల పైన చేసిన సిఫారసుల పై ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజుకు చేరింది. ప్రభుత్వం కార్మిక సంఘాలను సమ్మె విరమించి సహకరించాలని కోరుతోంది. జేఏసీ నేతలు మాత్రం తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. అటు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పైన కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాల జేఏసీ నేతల డిమాండ్ల పైన ప్రభుత్వానికి కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. కార్మికులు 2021, 2025 వేతన సవరణ పైన డిమాండ్ చేస్తుండగా.. ఆర్టీసీ యాజమాన్యం 2021 కి వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వానికి తాజాగా కొన్ని ప్రతిపాదనలు సమర్పించింది. అందులో భాగంగా గరిష్ఠంగా 10 శాతం ఫిట్ మెంట్ తో 5 నుంచి 8 శాతం మధ్య ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనలు సీఎం కార్యాలయానికి చేరాయి. ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. ఇతర డిమాండ్ల పైనా చర్చించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మేనిఫెస్టోలోని వాగ్దానాలు అన్నింటిని నెరవేర్చాలని ఆర్‌టీసీ జేఏసీ డిమాండ్ చేసింది.

నేటి కేబినెట్ భేటీలో చర్చ.. తుది నిర్ణయం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంతో పాటుగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తోంది. 2017 నుంచి అలవెన్సులను పెంచాలని.. 2017 పీఆర్సీ అమలు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్లు. ఆర్టీసీ అప్పులను ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి. బడ్జెట్లో 3 శాతం కేటాయించాలి. ఇక ఎనిమిది గంటల షిఫ్ట్ కూడా అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తోంది. కాగా.. ఈ డిమాండ్ల పైన చర్చించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. పరిష్కారానికి సమయం కోరింది. అయితే, కార్మిక సంఘాలు సమ్మెకు దిగటంతో ఇప్పుడు ప్రభుత్వం సమ్మె విరమింపచేసే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ రోజు కేబినెట్ భేటీలో కొన్ని డిమాండ్ల పైన సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అటు కార్మిక సంఘాలు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications