ఏఐ మాయాజాలం.. బ్రూస్ లీ, జాకీ చాన్ చిత్రాలు ఇక కొత్త రూపంలో!
Artificial Intelligence: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఏఐ సహకారంతో చైనా సినిమా చరిత్రలో ఒక విప్లవాత్మక అడుగు వేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) సాంకేతికతను ఉపయోగించి 100 క్లాసిక్ మార్షల్ ఆర్ట్స్ చిత్రాలకు కొత్త జీవం పోయనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో బ్రూస్ లీ, జాకీ చాన్, జెట్ లీ వంటి దిగ్గజ నటుల ఐకానిక్ సినిమాలు ఉన్నాయి. ఆధునిక ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఈ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అప్పీల్‌ను పెంచడమే లక్ష్యంగా చైనా ఈ పునరుద్ధరణ, ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టింది.
"కుంగ్‌ఫు మూవీ హెరిటేజ్ ప్రాజెక్ట్" ప్రారంభం
"కుంగ్‌ఫు మూవీ హెరిటేజ్ ప్రాజెక్ట్: 100 క్లాసిక్స్ ఏఐ రివైటలైజేషన్ ప్రాజెక్ట్" పేరుతో షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ భారీ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పాత తరం కుంగ్‌ఫు క్లాసిక్ చిత్రాలను డిజిటల్‌గా పునరుద్ధరించి, వాటి విజువల్స్, సౌండ్, మొత్తం నాణ్యతను మెరుగుపరుస్తారు. అయితే అసలు కథలు లేదా పాత్రలలో ఎటువంటి మార్పులు చేయరని ప్రాజెక్ట్ నిర్వాహకులు స్పష్టం చేశారు. పునరుద్ధరించబడే చిత్రాలో "ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ" (1972), "డ్రంకెన్ మాస్టర్" (1978), "ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ చైనా" (1991) వంటి క్లాసిక్‌లు ఉన్నాయి. ఈ సూపర్ చిత్రాలను సరికొత్తగా, మెరుగైన నాణ్యతతో చూడవచ్చు.

ఏఐతో పూర్తిగా యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్
ఈ ప్రాజెక్టులో కేవలం పునరుద్ధరణ మాత్రమే కాకుండా వినూత్న ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. జాన్ వూ బ్లాక్‌బస్టర్ చిత్రం "ఎ బెటర్ టుమారో"(1986)ను పూర్తిగా యానిమేటెడ్ ఏఐ నిర్మిత చిత్రంగా పునఃసృష్టిస్తున్నారు. "ఎ బెటర్ టుమారో:సైబర్ బోర్డర్" పేరుతో రానున్న ఈ యానిమేటెడ్ చిత్రంలో చౌ యున్-ఫాట్ పోషించిన పాత్రను సైబర్‌పంక్ సెట్టింగ్‌లో రీబూట్ చేయనున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా ఏఐ-జనరేటెడ్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అని నిర్మాత ప్రకటించారు. కేవలం 30 మంది బృందంతోనే ఈ యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందించడం ఏఐ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.
సినిమా చరిత్రకు నివాళి.. భవిష్యత్తుకు ముందడుగు
ఈ ప్రాజెక్టుకు సుమారు 100 మిలియన్ యువాన్ల(సుమారు 13.9 మిలియన్ డాలర్లు) భారీ బడ్జెట్‌ను కేటాయించారు. చైనా ఫిల్మ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఝాంగ్ పిమిన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ సినిమా చరిత్రకు నివాళి మాత్రమే కాదని.. భవిష్యత్తు వైపు ఒక ముందడుగు అని పేర్కొన్నారు. ఈ చిత్రాలు నిజమైన రత్నాలు అని.. ఏఐ వాటిని నేటి ప్రేక్షకులకు కొత్త పద్ధతిలో మరింత చేరువ చేస్తుందని ఆయన అన్నారు. షాంఘై కాన్క్సింగ్ కల్చర్ అండ్ మీడియా ప్రెసిడెంట్ టియాన్ మింగ్ మాట్లాడుతు.. ఈ ప్రాజెక్టు అసలు చిత్రాలకు కట్టుబడి ఉంటుందని.. అదే సమయంలో మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ప్రపంచ సినిమా పరిశ్రమలో ఏఐ వినియోగానికి ఇది ఒక నూతన ఒరవడిని సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.












Click it and Unblock the Notifications