"ఆయన్ను సభకు రప్పించండి"- కేంద్రానికి రాజ్యసభ ఛైర్మన్ అసాధారణ సూచన..!
ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు కావస్తున్నా ఉభయసభల్లో కార్యకలాపాలు మాత్రం ముందుకు సాగడం లేదు. దీనికి ప్రధాన కారణం నీట్ నిరసనల సందర్భంగా ఢిల్లీలో విద్యార్దులపై పెల్లెట్ గన్ ల ప్రయోగంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం కోసం విపక్షాలు డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడమే. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక బిల్లుల్ని చర్చలు లేకుండానే ప్రవేశపెట్టి, ఆమోదింపచేసుకుంటోంది. అయినా విపక్షాలు వెనక్కి తగ్గడం లేదు.
లోక్ సభలో పరిస్ధితి ఎలా ఉన్నా, రాజ్యసభలో (Rajya Sabha) మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రాకపోవడం రాజ్యసభ ఛైర్మన్ (Rajya Sabha Chairman) అయిన సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) కు ఇబ్బందికరంగా మారింది. విపక్షాలు పదే పదే అమిత్ షా సభకు వచ్చి విద్యార్దులపై జరిగిన దాడులపై సమాధానం ఇవ్వాలని కోరుతున్నాయి. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ జోక్యం చేసుకోక తప్పని పరిస్ధితి వచ్చేసింది. దీంతో ఆయన పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఓ అసాధారణ విజ్ఞప్తి చేశారు.

కోంద్ర హోంమంత్రి అయిన అమిత్ షాను సభకు రప్పించాలంటూ కిరణ్ రిజిజుకు రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సూచించారు. విపక్షాల వరుస ఆందోళనల నేపథ్యంలో అమిత్ షాను సభకు రప్పించే విషయాన్ని పరిశీలించాలని కిరణ్ రిజిజుకు ఆయన సూచించారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు విపక్షాల సెంటిమెంట్ ను గుర్తిస్తారని ఆశిస్తున్నట్లు సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. దీంతో కిరణ్ రిజిజు సరేనన్నారు. అంతకు ముందు విపక్షాలు ఢిల్లీ ఘటనలపై అమిత్ షా స్పందించాలని, సభకు వచ్చి సమాధాన ఇవ్వాలని పదే పదే పట్టుబడుతున్నాయి. ఇప్పటికే డీలిమిటేషన్ సహా ఇతర బిల్లుల్ని ఎలా నెగ్గించుకోవాలన్న అంశంపై అమిత్ షా పార్లమెంట్ కు వచ్చి సభకు మాత్రం రాకుండా చర్చలు జరుపుతున్నారు. దీంతో పార్లమెంట్ లో విపక్షాలు అమిత్ షా పోస్టర్లతో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.




Click it and Unblock the Notifications