Bill Gates: అన్నదాతలకు ఏఐ, అగ్రిటెక్ సేవలు సూపర్
రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో అమలవుతున్న సాంకేతిక మార్పులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ( Bill Gates) సోమవారం ఉండవల్లి కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు స్వాగతం పలికి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏఐ ఆధారిత రైతు సేవలను వివరించారు.
వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు రైతుల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలను గేట్స్‌కు వివరించారు. దిగుబడులు పెంచడం, సాగు ఖర్చులు తగ్గించడం, నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి మార్కెట్లకు చేర్చడం వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్టు తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో అనలిటిక్స్, మానిటరింగ్ డాష్‌బోర్డులు వినియోగిస్తూ పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు.

ఇటీవల ప్రారంభించిన ఏపీఏఐఎంఎస్ రైతు యాప్ (APAIMS) ద్వారా పంటల ఎంపిక నుంచి మార్కెట్ ధరల వరకు సమగ్ర సమాచారం అందిస్తున్నామని మహిళా రైతులు మణి, అన్నపూర్ణ గేట్స్‌కు వివరించారు. నేల స్వభావం, సాగునీటి నిర్వహణ, పురుగు మందుల నియంత్రణ, మార్కెట్ ధోరణులు... ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Bill Gates సమక్షంలోనే
బిల్ గేట్స్ సమక్షంలోనే రైతులు ఏఐ టూల్‌ను ఉపయోగించి పురుగులు పట్టిన మొక్క ఫోటోను అప్లోడ్ చేశారు. క్షణాల్లోనే ఆ వ్యాధిని గుర్తించిన వ్యవస్థ నివారణ సూచనలు ఇచ్చింది. వెంటనే డ్రోన్ సేవను బుక్ చేయగా, ప్రభావిత ప్రాంతంలో స్ప్రే నిర్వహించబడింది. ఈ ప్రక్రియను పరిశీలించిన గేట్స్, రైతులకు ఆధునిక ఏఐ-అగ్రిటెక్ సేవలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.
ఆంధ్రా వంటకాలు టేస్ట్ చేసి..
స్థానిక రైతులతో ఆయన ముఖాముఖి చర్చించి, వారి అనుభవాలను తెలుసుకున్నారు. మహిళా రైతులు స్వయంగా వండి తీసుకువచ్చిన స్థానిక వంటకాలను రుచి చూసిన గేట్స్, సేంద్రీయ సాగు పద్ధతులపై ఆసక్తి చూపారు. రైతుల ఉత్పత్తులను పరిశీలించి, టెక్నాలజీతో గ్రామీణ వ్యవసాయం ఎలా మారుతుందో ప్రత్యక్షంగా చూశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసి, రైతు ఆదాయాన్ని పెంచే దిశగా చేపడుతున్న చర్యలకు ఈ సందర్శన ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ నేడు సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్న ఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా… pic.twitter.com/A3vJa5m5vI
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 16, 2026












Click it and Unblock the Notifications