నా డీప్ ఫేక్ వీడియోలు కూడా బయటికొచ్చాయ్- జాగ్రత్తగా ఉండండి
సాంకేతిక ప్రగతిని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి తప్ప, దాన్ని దుర్వినియోగం చేయకూడదని, ఆయుధంగా మార్చకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రోజురోజుకూ ఉద్భవిస్తోన్న సాంకేతికతలను దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించారు. సాంకేతికతపై పూర్తి నియంత్రణ ఏ సమాజానికీ సాధ్యం కాదని, అయినప్పటికీ దానిపై ప్రభావం చూపే వారు సంయమనం, బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో నిర్మల సీతారామన్ మాట్లాడారు. ప్రపంచ సంక్షేమం కోసం పనిచేసినప్పుడు, దాని వెనుక ప్రజా ప్రయోజనమే ధ్యేయం కావాలి తప్ప మరో ఆలోచన ఉండకూడదని అన్నారు. ఎన్నటికీ ఆయుధీకరణ కాకూడదని పేర్కొన్నారు. సాంకేతికతను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా, దానిపై మనకు ఉన్న హక్కులు, సమాజ ప్రయోజనాలు, హానికారకంగా, దారి తప్పకుండా వాటిని ఎప్పటికీ ఉపయోగించకూడదని అన్నారు.

దురదృష్టవశాత్తు, ప్రపంచ సాంకేతిక పురోగతులు ఆయుధాలుగా మారడం, ప్రగతిని అడ్డుకోవడం తరచుగా చూడాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ వీడియోలు, డిజిటల్ మోసాల వంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పరిశీలనల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆవిష్కరణలకు సమతుల్య, సూత్రబద్ధమైన విధానం అవసరమని స్పష్టం చేశారు.
తన డీప్‌ఫేక్ వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రచారంలోకి వచ్చాయని నిర్మల సీతారామన్ గుర్తు చేశారు. ఇది AIని మోసాలకు ఎలా ఉపయోగించవచ్చో గుర్తు చేసినట్టయిందని అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మోసాలు అనేవి ఫైర్‌వాల్స్ ఉల్లంఘించడానికి మాత్రమే పరిమితం కావట్లేదని, నమ్మకాన్ని సైతం హ్యాక్ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నేరగాళ్లు ఇప్పుడు AIని ఉపయోగించి వాయిస్, ఐడెంటిటీని క్లోన్ చేయడం, నిజమైనవిగా భావించే వీడియోలను సృష్టిస్తోన్నారని చెప్పారు.
ప్రపంచ AI నిపుణుల్లో భారత్ 16 శాతం వాటాను సాధించిందని, టాప్ 3 దేశాల్లో ఒకటిగా నిలిచిందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. 2030 నాటికి దేశీయ సర్వీస్ రంగం ఆదాయంలో 30 నుంచి 35 శాతం వాటాను AI-పవర్డ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు అందించగలవని అంచనా వేసినట్లు వివరించారు. ఫిన్‌టెక్‌లు బాధ్యతాయుతంగా ఉండాలని సీతారామన్ సూచించారు. రెవెన్యూ వృద్ధి, లాభదాయకత, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి ప్రాథమిక అంశాలతో ఆవిష్కరణలను సమతుల్యం చేసుకోవాలని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications