కొంప ముంచిన మార్క్ మహాశయుడు
టాప్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మెటా.. భారీ లేఆఫ్ దిశగా అడుగులు వేస్తోంది. మొత్తం 20 శాతం మందిపై వేటు వేయనుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థలో పని చేస్తోన్న ఉద్యోగులందరిపైనా దీని ప్రభావం పడబోతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబడుల పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఈ సంస్థ ఈ తాజా చర్య తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పని చేస్తోన్న టెక్కీల్లో కనీసం 15,000 మంది ఇంటిదారి పట్టే అవకాశాలు లేకపోలేదు.
మెటా లేఆఫ్స్ పై రాయిటర్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ తొలగింపులు మెటా ప్రపంచ ఉద్యోగులలో అయిదోవంతును ప్రభావితం చేయగలవని అభిప్రాయపడింది. కిందటేడాది డిసెంబర్ 31 నాటికి మెటాలో సుమారు 79,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 15,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవచ్చు. ఏఐలో చేస్తున్న భారీ పెట్టుబడులను సమన్వయం చేసుకునేందుకే కంపెనీ ఈ తొలగింపులకు సిద్ధమవుతోంది.

మెటా గతంలో సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (MSL) కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించింది. స్కేల్ ఏఐ స్టార్టప్‌ను 14.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దాని చీఫ్ అలెగ్జాండర్ వాంగ్‌కు ఎంఎస్ఎల్ బాధ్యతలను అప్పగించింది. దీంతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. దీనికోసం మరిన్ని డాలర్లను ఖర్చు పెట్టనుంది. మొత్తంగా 2028 నాటికి ఏఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై 600 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలని మెటా ప్రణాళిక.
భారీ హ్యూమన్ రిసోర్స్ కు బదులుగా ఏఐ ఉత్పాదకతను పెంచుతుందని మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ గతంలో ప్రకటించారు కూడా. పెద్ద పెద్ద టీమ్ లు అవసరం అయ్యే పనులను ఇప్పుడు ఒక్క ఏఐతో పూర్తి చేయవచ్చని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తాజా లేఆఫ్స్ ప్రణాళికలు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మెటా తన ఉద్యోగులలో 20 శాతం మందిని తొలగిస్తే అది ఆ సంస్థ చరిత్రలోనే అతిపెద్ద తొలగింపు అవుతుంది. 2022 నవంబర్‌లో 11,000 మందిని తొలగించిందా సంస్థ. ఆ తర్వాత నాలుగు నెలల్లోనే మరో 10,000 మందికి ఉద్వాసన పలికింది.
కాగా రాయిటర్స్ ప్రచురించిన ఈ కథనం పట్ల మెటా స్పందించింది. ఈ వార్తలను తోసిపుచ్చింది. ఇది ఊహాజనితమని, లేఆఫ్స్ అనేవి సిద్ధాంత, విధానపరమైన నిర్ణయాలని మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబడి పెట్టాలనుకుంటోన్నప్పటికీ.. లేఆఫ్స్ పై ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications