టీటీడీ కొత్త పుంతలు- శ్రీవారి దర్శనంలో టెక్నాలజీ
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు ఏకంగా 91,720 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 44,678 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.80 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సేవా సదన్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయణగిరి, అళ్వార్ ట్యాంక్, కృష్ణతేజ, శిలాతోరణం వద్ద గల క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేస్తోంది.
వేసవి రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కిందటి నెల 15వ తేదీ నుండి భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. సాధారణంగా శుక్రవారం అభిషేక సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సమయం రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది. గత మూడు వారాలుగా దీనికి భిన్నమైన పరిస్థితులు తిరుమలలో నేెలకొన్నాయి.
మే నుంచి ప్రతిరోజూ సగటున 2.5 లక్షల అన్నప్రసాదాలు, 90,000కు పైగా అల్పాహారాలు, పానీయాలు అందిస్తోన్నారు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు. మే 24న ఒక్కరోజే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 93,950 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ రద్దీని క్రమబద్దీకరించడానికి టీటీడీ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించనుంది. శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలను మెరుగుపరచడానికి, దర్శన ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి, క్యూలైన్లలో రద్దీని తగ్గించడానికి ఈ టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్ణయించింది.
AIని వినియోగించడం ద్వారా క్యూలైన్లల్లో భక్తుల కదలికలను పర్యవేక్షించడం, రద్దీని అంచనా వేయడం, దర్శన సమయాన్ని తగ్గించడం సులభతరమౌతుంది. ఫేసియల్ రికగ్నిషన్ వినియోగించడం వల్ల నకిలీ బుకింగ్‌లను సైతం నివారించవచ్చని టీటీడీ భావిస్తోంది.
తిరుమల వైకుంఠం కంపార్ట్ మెంట్లు, ప్రవేశ మార్గాల వద్ద ఏఐ ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వీటి సహాయంతో భక్తుల కదలికలను ట్రాక్ చేస్తారు. దీనితోపాటు- స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి వీలవుతుంది. గంటలోపే దర్శనం చేసుకునేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగంలోకి తీసుకుని రానుంది టీటీడీ.
ఏఐ ద్వారా భక్తుల ఆధార్ కార్డు నంబర్, ఫేసియల్ రికగ్నేషన్ కు సంబంధించిన టోకెన్లను ఇస్తారు. శ్రీవారి దర్శన సమయాన్ని అందులో పొందుపరుస్తారు. వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న తరువాత ఫేసియల్ రికగ్నిషన్ ద్వారా వారి ముఖాన్ని స్కాన్ చేస్తారు. టోకెన్ తీసుకున్నది వాళ్లేనని తేలిన తరువాత క్యూ లైన్ లోకి పంపుతారు.












Click it and Unblock the Notifications