యశోద 'ఏఐ' క్యాంపెయిన్.. మహిళలకు ఫ్రీగా 'ఏఐ' లో శిక్షణ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో నేటి యువతతో పాటు మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు ఈ సాంకేతికతను అలవరచుకుంటున్నారు. ముఖ్యంగా నేటి యువత ఉపాధి, ఉద్యోగాల్లో అవకాశాలు అంది పుచ్చుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆరి తేరాల్సిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం భారీగా పెరిగిపోయింది. ఏఐ సాంకేతికత ప్రతి రంగంలోనూ వ్యాప్తి చెందుతోంది. మానవుడు పరిష్కరించలేని ఎన్నో సవాళ్లు, సమస్యలను ఏఐ సెకన్ల వ్యవధిలోనే సమాధానం అందిస్తోంది. భవిష్యత్తులో ఏఐ మరింత అభివృద్ది చెందుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నేటి యువత అటు విద్యాపరంగా లేదా ఉద్యోగ పరంగా లేదా వ్యాపార పరంగానైనా కచ్చితంగా ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
అయితే దేశంలోని మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ను చేరువ చేసేందుకు, డిజిటల్ అక్షరాభ్యాసాన్ని మహిళలకు అందించేందుకు ఉత్తర్ ప్రదేశ్, బరేలీలోని మహాత్మా జ్యోతిభా పూలే యూనివర్సిటీలో తాజాగా ఓ వర్క్ షాప్ నిర్వహించారు. యశోద ఏఐ కార్యక్రమంలో భాగంగా ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. మహిళలకు టెక్నాలజీలో పట్టు సాధించడం కోసం ఈ కార్యక్రమం ప్రారంభించారు. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్(NCW) ఈ మిషన్ కు పూర్తి సారథ్యం వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు సాంకేతికతలో మెలకువలు నేర్పించి వారిని అభివృద్ధి పథంలోకి నడిపించనుంది కేంద్ర ప్రభుత్వం.

ఈ యశోద ఏఐ కార్యక్రమం ముఖ్యంగా గ్రామాల్లోని పేద, మధ్య తరగతి, ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. వారికి డిజిటల్ లిటెరసీ అందించడం, ఏఐపై పూర్తి అవగాహన కల్పించి ప్రస్తుత సాంకేతిక యుగంలో అట్టడుగు వర్గాలనూ భాగస్వామ్యం చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మొదట ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలో ప్రారంభించారు. అనంతరం యూపీ వ్యాప్తంగా విస్తరించింది. అలాగే గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ విధానం విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఏఐ ను నేర్చుకోవడమే కాదు.. ఆ సాంకేతికత తమ కుటుంబం, పిల్లలు, ఉపాధి, భవిష్యత్తు కోసం ఎలా ఉపయోగపడుతుంది అని అడుగుతున్నారని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్(NCW) ఛైర్మన్ విజయ రహత్కార్ తెలిపారు.












Click it and Unblock the Notifications