గెట్ రెడీ: అనిర్వచనీయమైన అనుభూతిని పంచే పాపికొండల విహారయాత్ర మళ్లీ మొదలు: పూర్తి వివరాలివే!
అమరావతి: అందమైన పాపికొండల మధ్య బోటు ప్రయాణం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని మిగిలిస్తుంది. చుట్టూ ఎత్తయిన పర్వతాలు, మధ్యలో పరవళ్లు తొక్కే గోదారిపై బోటులో షికారు చేయడం..జీవితాంతం గుర్తుండిపోయేలా చిరస్మరణీయమైన తీపి గుర్తులను అందిస్తుంది. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవులతో నిండిన పాపికొండల మధ్య బోటు ప్రయాణం చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు ప్రకృతి ప్రేమికులు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల మధ్య సుమారు 40 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ పాపికొండల బోటు ప్రయాణాన్ని ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించింది.
రాజమహేంద్రవరం నుంచి
రాజమహేంద్రవరం నుంచి పాపికొండల విహార యాత్ర మొదలవుతుంది. దేవిపట్నం మండలంలోని పోశమ్మగండి గుడి వరకు రోడ్డు మార్గంలో సాగుతుంది. అక్కడినుండి లాంచిల్లో పూడిపల్లి, సిరివాక, కొల్లూరు మీదుగా పేరంటాలపల్లి ఈశ్వరాలయం వరకు సాగుతుంది. ఈ యాత్రలో గోదావరి చాలా తక్కువ వెడల్పుతో ప్రవహిస్తుంటుంది. దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద లాంచీ ప్రమాదానికి గురి కావడం, సుమారు 50 మందికి పైగా ప్రయాణకులు జలసమాధి కావడంతో దీన్ని నిలిపివేసింది ప్రభుత్వం. ఆ తరువాత కరోనా వైరస్ పరిస్థితులు తలెత్తడంతో దీని పునరుద్ధరణలో జాప్యం చోటు చేసుకుంది.
11 బోట్లు అందుబాటులో..
మొత్తంగా పాపికొండల విహార యాత్ర కోసం ఏపీ ప్రభుత్వం 11 బోట్లకు అనుమతి ఇచ్చింది. వాటిలో రెండు పర్యాటక సంస్థ ఆధీనంలో నడిచేవి. మిగిలిన తొమ్మిది లాంచీలను ప్రైవేటు ఆపరేటర్లు నడిపిస్తున్నారు. 2019లో సంభవించిన బోటు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం అనేక కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. పర్యాటకులు వాటిని తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. లైఫ్ జాకెట్ ధరించాలి. కరోనా వైరస్ ప్రొటోకాల్స్‌ను పాటించాలి. ఇదివరకటి నిబంధనలతో పోల్చితే.. ఈ సారి అనేక మార్పులు చేశారు అధికారులు. గత అనుభవాల నేపథ్యంలో- ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
టికెట్ ధర..
పాపికొండల విహార యాత్రకు అధికారులు 1,250 రూపాయలను టికెట్ ధరగా నిర్ధారించారు. ఒక్కో పర్యాటకుడి రానుపోను ఛార్జీలు, నివాసం, భోజన వసతిని ఇందులోనే వసూలు చేస్తారు. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ ద్వారా కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యం ఏపీ పర్యాటక సంస్థకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ వెబ్‌సైట్ అడ్రస్.. www. aptdc. gov. in. ఆఫ్‌లైన్ ద్వారా టికెట్లను పర్యాటక కేంద్రాల కౌంటర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
పైలెట్ బోటు ఏర్పాటు..
ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి కొత్తగా పైలెట్ బోటును ఏర్పాటు చేశారు అధికారులు. పైలెట్ బోటు ముందుగా వెళ్తుంది. పర్యాటకుల లాంచీలు దాన్ని అనుసరించాల్సి ఉంటుంది. పర్యాటకుల రక్షణ కోసం అయిదు చోట్ల కంట్రోల్‌రూమ్‌లను అందుబాటుకి తీసుకొచ్చింది. రెవెన్యూ, పోలీసు, పర్యాటక, జలవనరుల శాఖ సిబ్బంది ఈ కంట్రోల్ రూమ్‌లల్లో అందుబాటులో ఉంటారు. వాటి పర్యవేక్షణ బాధ్యతను స్థానిక డిప్యూటీ తహసీల్దార్‌కు అప్పగించారు.
Recommended Video

పైలెట్ బోటులో..
పర్యాటకుల బోట్లకు చుక్కానిలా ఉండే పైలెట్ బోటులో గజ ఈతగాళ్లతో కూడిన రెస్క్యూ టీమ్ అందుబాటులో ఉంటుంది. ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే.. పర్యాటకులను తక్షణమే కాపాడటానికి అవసరమైన తాళ్లు, అదనపు లైఫ్ జాకెట్లు, ఆక్సిజన్ వంటివి అందుబాటులో ఉంటాయి. తొలుత ఈ రెస్క్యూ టీమ్‌తో కూడిన పైలెట్ బోటు బయలుదేరాలి. దాన్ని పర్యాటకుల బోట్లు అనుసరించాల్సి ఉంటుంది. చివరన ఎస్కార్ట్ బోటులో శాటిలైట్ ఫోన్ కూడా అందుబాటులో ఉంటుంది. పైలెట్, ఎస్కార్ట్ బోటు లేనిదే పర్యాటకుల లాంచీలను తీసుకెళ్లడం నిషేధం.












Click it and Unblock the Notifications