ఎవ్వరికీ తెలియని 4వ రహస్య అణు కేంద్రంలో కిమ్. ఏం ప్లాన్ చేస్తున్నాడు?
ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, తన దూకుడుతో ఎప్పుడూ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్ మరోసారి ప్రపంచానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశంలో కొత్తగా ప్రారంభించిన ఒక రహస్య 'అణు సామగ్రి ఉత్పత్తి కేంద్రం' (యురేనియం సుసంపన్నం చేసే కేంద్రం) లో ఆయన కీలక అధికారులతో కలిసి ఆకస్మిక పర్యటన జరిపారు. ఈ సందర్భంగా తమ దేశ అణు ఆయుధ సంపత్తిని ఊహించని రీతిలో, 'విపరీతంగా' పెంచుతామని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA)ని ఉటంకిస్తూ యొన్‌హాప్ వార్తా సంస్థ అధికారికంగా వెల్లడించింది.
కిమ్ పర్యటించిన ఈ సరికొత్త అణు కేంద్రం ఎక్కడ ఉంది? దాని పూర్తి వివరాలు ఏంటి? అనే విషయాలను ఉత్తర కొరియా అత్యంత గోప్యంగా ఉంచింది. నిఘా వర్గాల అంచనాల ప్రకారం.. ఉత్తర కొరియాలో ఇప్పటికే యోంగ్బ్యాన్, కుసాంగ్, కాంగ్‌సన్ అనే మూడు ప్రముఖ యురేనియం సుసంపన్న కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు కిమ్ సందర్శించిన ఈ లేటెస్ట్ ప్లాంట్ నాలుగోది అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కేంద్రం లోపల అణు బాంబుల తయారీకి వాడే స్థూపాకార సెంట్రిఫ్యూజ్‌లు వరుసలుగా అమర్చి ఉన్న చిత్రాలను కూడా అక్కడి మీడియా విడుదల చేసింది. కిమ్ కూర్చున్న బల్లపై ఉన్న కొన్ని కీలక అణు ఆయుధ పత్రాలను మాత్రం ఫొటోల్లో కనిపించకుండా అస్పష్టంగా (Blur) మార్చడం గమనార్హం.

ఐదేళ్లలోనే రెట్టింపు సామర్థ్యం..
ఈ పర్యటనలో భాగంగా నిర్వహించిన ఉన్నత స్థాయి అంకెల సమీక్షా సమావేశంలో కిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల కాలంలోనే తమ దేశ అణు ఆయుధాల తయారీ సామర్థ్యం రెట్టింపు కంటే ఎక్కువైందని ఆయన గర్వంగా ప్రకటించారు. "మన దేశానికి ఎదురవుతున్న సంభావ్య బెదిరింపులు, భవిష్యత్తులో వచ్చే అనూహ్య సంక్షోభాలను ఎదుర్కోవాలంటే.. అణు నిరోధక శక్తిని క్వాంటిటీ, క్వాలిటీ (పరిమాణం, నాణ్యత) రెండింటిలోనూ రాకెట్ వేగంతో విస్తరించక తప్పదు" అని కిమ్ స్పష్టం చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆశయాల నుండి వెనక్కి తగ్గేదే లేదని ఆయన దీని ద్వారా పరోక్షంగా తేల్చిచెప్పారు.
అణు లెక్కలు మార్చిన కిమ్!
"ఈ రోజు మనం మన అణు కార్యకలాపాలకు సంబంధించిన కీలక అంకెలను (డిజిట్స్) నవీకరించాము" అని కిమ్ ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అంటే అణుబాంబుల ఉత్పత్తి టార్గెట్‌ను వారు భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని అణు సామర్థ్యాల వృద్ధిలో ఒక 'చారిత్రక మైలురాయి'గా కిమ్ అభివర్ణించారు.
నిజానికి 2024 సెప్టెంబరులోనే ఉత్తర కొరియా తమ యురేనియం సుసంపన్న కేంద్రాన్ని ప్రపంచానికి మొదటిసారి చూపించింది. అంతకుముందు జరిగిన పార్టీ మహాసభల్లోనే తాము ఎప్పటికీ 'మరపురాని' అణు సాయుధ దేశంగా ఉంటామని ప్రకటించుకుంది. ఐదేళ్ల సైనిక ఆధునికీకరణ ప్లాన్‌లో భాగంగానే కిమ్ ఇప్పుడు ఈ కొత్త అణు కేంద్రాన్ని ప్రారంభించి, తన సైనిక పట్టును మరింత బిగించారు. కిమ్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం అమెరికా, దక్షిణ కొరియా లాంటి ప్రత్యర్థి దేశాలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.














Click it and Unblock the Notifications