ఏపీ, తెలంగాణాలకు రైళ్ల పండుగ.. మళ్లీ కొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్ళు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే రైల్వే అభివృద్ధి పనులతో, అనేక భారీ ప్రాజెక్టులతో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పరుగులు పెడుతున్న రైల్వేశాఖ తాజాగా తీసుకున్న మరో నిర్ణయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు లబ్ధి చేకూరుస్తుంది. దేశవ్యాప్తంగా కొత్తగా ఏడు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను నడపడానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. వీటిలో రెండు రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రయాణించనున్నాయి.
తక్కువ చార్జీలతో అమృత్ భారత్ రైళ్ళు
సాధారణ, మధ్య తరగతి ప్రజలకు తక్కువ చార్జీలతో సౌకర్యవంతమైన ప్రయాణాలను చేసేందుకు వీలుగా ప్రవేశపెడుతున్నారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు ప్రధానంగా దూరప్రాంతాలకు సర్వీస్ లను అందిస్తాయి. వీటి టికెట్ ధరలు చాలా తక్కువగా ఉండడంతో వీటిలో ప్రయాణం చేసే ప్రయాణికులకు ఖర్చు తక్కువ అవుతుంది. ఇవి సౌకర్యవంతమైన రైళ్ళు కావడంతో, ఎలాంటి ఇబ్బంది లేకుండా దూరప్రాంతాలకు ప్రయాణం చేయవచ్చు.

కొత్తగా ఆమోదం పొందిన ఏడు రైళ్ళు
అయితే కొత్తగా ప్రయాగ్‌రాజ్-లోకమాన్య తిలక్ టెర్మినస్, ధన్‌బాద్-కోయంబత్తూర్, సుబేదార్‌గంజ్-లోకమాన్య తిలక్ టెర్మినస్, గోరఖ్‌పూర్-ఢిల్లీ, ప్రయాగ్‌రాజ్-ఉద్నా, గోరఖ్‌పూర్-బాంద్రా టెర్మినస్, చర్లపల్లి-గోరఖ్‌పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొత్తగా ఆమోదం పొందాయి.ఈ ఏడు రైళ్ళలో ధన్బాద్- కోయంబత్తూర్, చర్లపల్లి గోరఖ్ పూర్ రైళ్లు తెలుగు రాష్ట్రాల గుండా వెళ్తాయి.
ఈ మార్గాల్లో కొత్త అమృత్ భారత్ రైళ్ళు
ధన్‌బాద్-కోయంబత్తూర్ రైలు తెలుగు రాష్ట్రాలలో వరంగల్, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి గోరఖ్ పూర్ రైలు తెలంగాణ మీదుగా కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బల్లార్షా మీదుగా గోరఖ్ పూర్ వెళుతుంది. ఈ ఏడు రైళ్ల వల్ల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రైలు అనుసంధానం మరింత బలోపేతం అవుతుంది.
త్వరలో రైళ్లకు టైం షెడ్యూల్స్ వచ్చే అవకాశం
ఈ రైళ్ళ ఏర్పాటుకు సంబంధించి రైల్వే శాఖ నుండి అనుమతులు రావడంతో త్వరలోనే ఈ రైళ్ళు పట్టాలెక్కనున్నాయి.అతి త్వరలో ఈ రైళ్లకు సంబంధించి టైమ్ షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు అనేక ప్రధాన నగరాలను కలుపుతూ సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు రైళ్ళు కూడా ఆ జాబితాలో చేరడంతో మరింత మెరుగైన రైల్వే సేవలు ప్రయాణికులకు అందనున్నాయి.













Click it and Unblock the Notifications