అర్ధరాత్రి తీరం దాటిన తీవ్ర వాయుగుండం! 48 గంటలు డేంజర్ బెల్స్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అర్ధరాత్రి ఉత్తరాంధ్ర తీరాన్ని తాకింది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి నైరుతి దిశగా విపాఖపట్నం, గోపాల్‌పూర్ (ఒడిశా) మధ్య ఈ వాయుగుండం తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ అధికారులు ధ్రువీకరించారు. గడిచిన కొద్ది గంటలుగా గంటకు 5 కిలోమీటర్ల నెమ్మది వేగంతో రాత్రి వేళ వాయువ్య దిశగా ప్రయాణించిన ఈ ద్రోణి, ప్రస్తుతం భూభాగంలోకి ప్రవేశించింది. దీని ప్రభావం వల్ల తదుపరి 12 గంటల పాటు తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతూ, ఆ తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ తీవ్ర రూపం కారణంగా రాబోయే 48 గంటల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది.

పలాసలో అత్యధికంగా 143 మి.మీ. వర్షపాతం నమోదవ్వగా.. అల్లూరి జిల్లాలో వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని, వాగులు, కాల్వలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలను వేగవంతం చేసింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆపదలో ఉన్న జిల్లాల్లో మొత్తం 5 ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF), 4 ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలను రంగంలోకి దించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. సమాచారం కోసం 112, 1070, 1800-425-0101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
నేడు ఈ జిల్లాల్లో పరిస్థితి ఇదే..
- అత్యంత భారీవర్షాలు : ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లు
- భారీ నుంచి అతిభారీ వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలు
- ఓ మోస్తరు వర్షాలు: కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలు
- తేలికపాటి నుంచి ఓ మోస్తరు: మార్కాపురం, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు


Download











Click it and Unblock the Notifications
