ఎర్రకోటపై ప్రధాని మోదీ ధరించినది అసలు మన దేశ జాతీయ పతాకమే కాదు- ఆ దేశానిది
దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధరించిన దుస్తులు ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీశాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయంలో ఆయన ధరించే ప్రత్యేక శైలితో కూడుకున్న దుస్తులు, వైవిధ్యంగా కనిపించే తలపాగాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతుంటాయి. ఈసారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌పై అలంకరించిన పాకెట్ స్క్వేర్స్ లో కనిపించిన జాతీయ పతాకం అమరిక ఇప్పుడు తీవ్ర వివాదానికి కేంద్రబిందువు అయింది. ప్రధాని మోదీ జాతీయ జెండాను తలకిందులుగా అమర్చుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ విమర్శలకు మరింత ఆజ్యం పోసింది.

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుపు రంగు కుర్తా-పైజామాతో పాటు చాక్లెట్ బ్రౌన్ కలర్ స్లీవ్‌లెస్ జాకెట్, సాంప్రదాయ తలపాగాలను ధరించారు. ఈ జాకెట్‌పై ఆకుపచ్చ, తెలుపు, కాషాయం రంగులలో ఉన్న మూడు జేబు రుమాళ్లను అమర్చారు. సాధారణంగా భారత జాతీయ జెండా పైభాగంలో కాషాయం, మధ్యలో తెలుపు, దిగువన ఆకుపచ్చ రంగులు ఉంటాయి. దీనికి భిన్నంగా మొదట ఆకుపచ్చ రంగు, ఆ తర్వాత తెలుపు, చివర్లో కాషాయ రంగుతో తలకిందులుగా కనిపించింది.
ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా. ఆయన వేసుకున్న పాకెట్ స్క్వేర్ రంగులు, దాని అమరికను తప్పుపట్టారు. ప్రధాని మోదీ మన దేశ మువ్వన్నెల పతాకాన్ని కాకుండా ఐర్లాండ్ జాతీయ పతాకాన్ని ధరించారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఉర్దూ భాషలో త్రివర్ణ పతాకాన్ని ధరించినట్లుగా ఉందని విమర్శించారు. ఉర్దూను కుడి నుంచి ఎడమ వైపు రాస్తారనే విషయం తెలిసిందే.
ప్రధాని మోదీ ధరించిన జాతీయ పతాకం కూడా కుడి నుంచి ఎడమవైపుగా అమర్చినట్లు ఉందని పవన్ ఖేరా సెటైర్లు వేశారు. పైగా అది ఐర్లాండ్ జాతీయ పతాకాన్ని పోలి ఉందని, ప్రధాని మోదీ.. ఆ దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్లుగా అనిపిస్తోందని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో సెటైర్లు వేశారు. అటు పవన్ ఖేరాతో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సుప్రియ శ్రినాతే కూడా దీనిపై స్పందించారు. సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రే మువ్వన్నెలతో కూడిన పాకెట్ స్క్వేర్ ను తప్పుగా ధరించారంటూ ఆరోపించారు.
Lagta hai sahib ne Urdu mein Tiranga pehna hai.
— Pawan Khera 🇮🇳 ಪವನ್ ಖೇರಾ (@Pawankhera) August 15, 2026
Ya phir Bharat 🇮🇳 ki jagah Ireland 🇮🇪 ka Independence Day mana rahay hain. pic.twitter.com/g0EiOLWICI
ఐర్లాండ్ జాతీయ జెండా దాదాపుగా ఇవే రంగులను పోలి ఉంటుంది. అందులో మొదట ఆకుపచ్చ, మధ్యలో తెలుపు, దిగువన కాషాయం రంగులు నిలువు వరుసలలో అమరి ఉంటాయి. ప్రధాని మోదీ జాకెట్ పాకెట్ స్క్వేర్ ఇదే రకంగా ఉండటంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దీన్ని ఐర్లాండ్ జాతీయ జెండాతో పోల్చారు. ఉర్దూ భాషను కుడి నుండి ఎడమకు చదివే విధానానికి ప్రతీకగా దీనిని ఉర్దూలో తిరంగా అని అభివర్ణించారు.














Click it and Unblock the Notifications