Abraham Lincoln: నడి సంద్రంలో నరకం.. 250 రోజులుగా నావికుల హాహాకారాలు!
ఆరు నెలల ముచ్చట అనుకుంటే ఏడాది కావస్తోంది.. రికార్డు స్థాయి సుదీర్ఘ మిషన్‌తో సైనికులకు సముద్ర ప్రయాణం నరకంగా మారింది. యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరడం వరకే లోకానికి కనిపిస్తోంది. కానీ ఆ భారీ యుద్ధనౌకల లోపల తాగునీరు లేక, టాయిలెట్లు పనిచేయక, కనీసం తాగడానికి నీరు లేక.. కంపుకొడుతున్న బట్టలు ఉతుక్కునే దిక్కులేక వేలాది మంది జవాన్లు మనోవేదనతో కుమిలిపోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక ఇప్పుడు సైనికులను ఆత్మహత్యలు చేసుకునేంత ఒత్తిడిలోకి నెడుతుంది.
అమెరికా రక్షణ శాఖ ప్రతిష్ఠాత్మకంగా భావించే 'యుఎస్ఎస్ అబ్రహాం లింకన్' విమానవాహక నౌక ఇప్పుడు ఓ కదులుతున్న జైలులా మారింది. సాధారణంగా నేవీ నిబంధనల ప్రకారం ఏ యుద్ధనౌక అయినా ఏడు నెలలకు మించి సముద్రంలో ఉండకూడదు. కానీ, అంతర్జాతీయంగా చెలరేగుతున్న యుద్ధాలు, ఉద్రిక్తతల నెపంతో నావికులకు ఇంటిబాట లేకుండా చేస్తున్నారు. వియత్నాం యుద్ధం తర్వాత అత్యధిక కాలం సముద్రంలోనే గడిపిన నౌకగా ఇటీవలే 'యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫ్రాంక్' నిలిచింది. సరిగ్గా 326 రోజుల పాటు ఆ నౌకను సముద్రంలోనే ఉంచారు. ఇప్పుడు 'అబ్రహాం లింకన్' నౌక కూడా ఆ రికార్డును దాటేసేలా కనిపిస్తోంది. డిసెంబర్ తర్వాత నావికులు కనీసం ఒడ్డుపై కాలు మోపిన పాపాన పోలేదు.

నీళ్లు రావు.. టాయిలెట్లు పనిచేయవు!
నౌకలో పరిస్థితి ఏమీ బాగోలేదని అక్కడ పనిచేస్తున్న జవాన్లు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే కెప్టెన్ మైక్‌లో మాట్లాడేటప్పుడు 'ఈ రోజు అయినా ఇంటికి వెళ్లే వార్త చెప్తారా' అని సైనికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నౌకలో ప్రాథమిక సదుపాయాలు ఘోరంగా తయారయ్యాయి. వాటర్ ట్యాప్స్ చెడిపోయి, వేడినీళ్లు రాక జవాన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్లు పొంగిపొర్లుతున్నాయని, షిప్ స్టోర్లలో కనీసం స్నానం చేసే సబ్బులు, టూత్‌పేస్టులు కూడా దొరకడం లేదని నావికులు వాపోతున్నారు. గతంలో కావలసినన్ని వస్తువులు కొనుక్కునే వెసులుబాటు ఉండేదని, ఇప్పుడు ప్రతీ దానికి పరిమితులు విధించడంతో నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడిందని చెబుతున్నారు.
మానసిక నరకం.. ప్రాణాలు తీసుకుంటున్న సైనికులు
నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండటం, దానికి తోడు ఘర్షణ వాతావరణం కావడంతో సైనికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. నౌకలో ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువవుతున్నాయని, కొందరు జవాన్లు ఏకంగా యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ పైకి ఎక్కి నడిసముద్రంలోకి దూకేందుకు యత్నించారని సమాచారం. ఇద్దరిని అధికారులు సకాలంలో కాపాడారు.
'నా భర్త చాలా శాంతపరుడు.. కానీ ఇప్పుడు ఫోన్ చేసినప్పుడల్లా తీవ్రమైన కోపంతో, మానసిక అలసటతో మాట్లాడుతున్నాడు' అని ఓ జవాను భార్య కన్నీటిపర్యంతమైంది. యుద్ధాల పేరుతో అమెరికా ప్రభుత్వం నావికుల జీవితాలతో ఆడుకుంటోందని జవాన్ల కుటుంబాలు మండిపడుతున్నాయి.
యుద్ధాలకు లీడర్.. నిర్వహణలో జీరో!
అమెరికా నేవీకి ఇలాంటి భారీ విమానవాహక నౌకలు 11 మాత్రమే ఉన్నాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఇరాన్, వెనిజులా పరిణామాల వల్ల ఈ నౌకలపై భారం విపరీతంగా పెరిగింది. పాత నౌకలకు పదేపదే రిపేర్లు వస్తుండటం, కొత్త నౌకల తయారీలో ఊహించని ఆలస్యం జరుగుతుండటంతో ఉన్న నౌకలనే నేవీ ఎక్కువ కాలం సముద్రంలో తిప్పుతోంది. నౌకలోని కీలక విభాగాలు అరిగిపోతున్నప్పటికీ కంటితుడుపు చర్యలతోనే నావికాదళం కాలం వెళ్లదీస్తోంది.
సమస్య తీరేది ఎప్పుడు?
అమెరికా పాలకులు పాత పద్ధతులనే మళ్లీ తెరపైకి తెచ్చే ఆలోచనలు చేయడం వల్ల కొత్త నౌకల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చే నౌకలకు మళ్లీ మార్పులు చేర్పులు చేయాలంటే బిలియన్ల కొద్దీ డాలర్లు దండగ కావడమే కాకుండా, నూతన నౌకలు అందుబాటులోకి రావడానికి మరో దశాబ్దం పట్టవచ్చు. అంటే, రాబోయే రోజుల్లో అమెరికా నావికులకు ఈ సుదీర్ఘ సముద్ర నరకం తప్పేలా లేదు. గాల్లో విమానాల విన్యాసాలు పతాక శీర్షికల్లో నిలుస్తున్నప్పటికీ.. ఆ కదులుతున్న ఇనుప కొండలలో వేలాది మంది జవాన్లు పడుతున్న వేదన మాత్రం అభేద్యంగానే మిగిలిపోతోంది.














Click it and Unblock the Notifications