నల్సార్ కు బార్ కౌన్సిల్ సారీ చెప్పాల్సిందే..! సీజేఐకి మరో లా యూనివర్శిటీ షాక్..!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ తో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాపై న్యాయ విద్యార్ధుల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే యువతను బొద్దింకలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జంతర్ మంతర్ వద్ద విద్యార్ధుల నిరసనల విషయంలో చేసిన వ్యాఖ్యల తర్వాత సీజేఐ సూర్యకాంత్ పై ఆగ్రహంగా ఉన్న పలు ఉన్నత విద్యాసంస్థల విద్యార్ధులు ఆయన్ను తమ సంస్థల్లోకి రానివ్వొద్దంటూ అధికారుల్ని కోరుతున్నారు. ఇప్పుడే ఇదే క్రమంలో మరిన్ని సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ముంబైలోని టాటా ఇన్ స్టిట్యూట్ విద్యార్ధులు ముందుగా సీజేఐ సూర్యకాంత్ కు తమ విద్యాసంస్థ స్నాతకోత్సవానికి రావాలని ఆహ్వానం పంపడంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో ఆ కార్యక్రమం కాస్తా వాయిదా పడింది. ఆ తర్వాత హైదరాబాద్ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ విద్యార్ధులు సైతం తమ స్నాతకోత్సవానికి కూడా రావొద్దంటూ సీజేఐపై ఆగ్రహం వెళ్లగక్కుతూ లేఖ రాశారు. దీనిపై స్పందించిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, బీజేపీ ఎంపీ మనన్ కుమార్ మిశ్రా వారిని న్యాయవాదులుగా రిజిస్టర్ చేయొద్దంటూ దేశంలోని బార్ కౌన్సిల్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి.

సీజేఐని రావొద్దన్న నల్సార్ విద్యార్ధుల్ని లాయర్లుగా నమోదు కాకుండా ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదం కావడంతో గంటలోనే మనన్ మిశ్రా వాటిని వెనక్కి తీసుకున్నారు. అయినా నల్సార్ విద్యార్ధులు, మాజీ విద్యార్ధులు ఏకమయ్యారు. ఆయన ఆదేశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU) స్నాతకోత్సవానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రాతో పాటు సీజేఐ సూర్యకాంత్ హాజరుకావడాన్ని 700 మందికి పైగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు వ్యతిరేకించారు.
వారంతా నల్సార్ వర్శిటీ విద్యార్థి , అధ్యాపక వర్గానికి బీసీఐ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. బీసీఐ చర్యలను భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడిగా వారు అభివర్ణించారు. బీసీఐ చర్యలు నల్సార్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛపై భయానక ప్రభావాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఎలాంటి అసమ్మతి చర్యకైనా తీవ్రమైన వ్యక్తిగత, వృత్తిపరమైన పరిణామాలు ఎదురవుతాయనే స్పష్టమైన సంకేతాన్ని అవి పంపుతున్నాయని వారు విమర్శించారు.














Click it and Unblock the Notifications