గ్రీన్ సిగ్నల్ లభించిందండోయ్
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన మన శంకరవర ప్రసాద్ గారు, రాజాసాబ్ సినిమాల టికెట్ల పెంపు వ్యవహారంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. తెలంగాణ హైకోర్టు ఈ రెండు సినిమాల నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. టికెట్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవడానికి లైన్ క్లియర్ చేసింది. టికెట్ రేట్ల పెంపు విషయంలో నిర్మాతలు అందజేసిన వినతి పత్రాలపై నిర్ణయం తీసుకోవాలని హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది.
గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు.. ఓజీ, గేమ్ ఛేంజర్, పుష్ప 2, అఖండ 2 సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. రాజా సాబ్,మన శంకర వరప్రసాద్ గారు టిక్కెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతుల కోసం ఇదివరకు ప్రభుత్వానికి నిర్మాతలు ప్రతిపాదనలను అందజేశారు. దీనిపై ఏ నిర్ణయం కూడా తీసుకోకపోవడం, సినిమాల విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు.

టీజీ విశ్వ ప్రసాద్, ఇషాన్ సక్సేనా, సాహు గారపాటి అప్పీల్ ను దాఖలు చేశారు. ధరల పెంపు సరికాదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని అభ్యర్థించారు. టికెట్ల పెంపుపై గత నెలలో జస్టిస్ శ్రావణ్ కుమార్ కీలక ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. 'అఖండ 2'కు అధిక ధరలకు అనుమతించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మెమోను నిలిపివేశారు. పెంచిన ధరలకు టికెట్లు విక్రయించరాదని అధికారులను ఆదేశించారు.
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. టికెట్ల ధరల పెంపు అభ్యర్థనలను ఇకపై స్వీకరించబోమని బహిరంగంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల మధ్య రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు.. హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.
చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన 'మన శంకర వరప్రసాద్ గారు' నిర్మాతలు సవరించిన ధరల కోసం ప్రభుత్వానికి అభ్యర్థన పంపారు. ఈ నెల 11 రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోలకు రూ. 600 (అన్ని థియేటర్లలో), జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు సాధారణ షోలకు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 227, మల్టీప్లెక్స్‌లలో రూ. 395 ధరలను ప్రతిపాదించారు.
ప్రభాస్ 'ది రాజా సాబ్' నిర్మాతలు కూడా తెలంగాణలో ఇలాంటి ధరల అనుమతులనే కోరే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. టికెట్ పెంపునకు సంబంధించిన గత ఉత్తర్వులను నిలిపివేయడానికి వారు అధికారికంగా హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు టికెట్ల పెంపు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications