సూపర్ స్టార్ కృష్ణ ఫోన్ చేస్తే... ‘మీ చావు మీరు చావండి’ అంటూ ఫోన్ పెట్టేసిన ఎన్టీఆర్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ ను రెండు కళ్లుగా భావించేవారు. ఆ తర్వాత తరం హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ తనదైన శైలిలో దూసుకువచ్చి ఇండస్ట్రీని ఊపేశారు. పాతతరం హీరోల మధ్య ఎంతటి ప్రేమాభిమానాలు ఉండేవో, బాక్సాఫీస్ వద్ద అంతకు మించిన పంతాలు, పోటీలు నడిచేవి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ల మధ్య సాగిన వైరం అప్పట్లో ఒక సంచలనం. కేవలం సినిమాల పరంగానే కాకుండా, వ్యక్తిగత నిర్ణయాల్లోనూ వీరిద్దరి మధ్య తరచుగా అభిప్రాయ భేదాలు తలెత్తేవి. ఆ పంతానికి పరాకాష్టే 'దానవీరశూరకర్', 'కురుక్షేత్రం' సినిమాల విడుదల.
తెర వెనక పోటీకి పునాది
ఎన్టీఆర్ తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా 'దానవీరశూరకర్ణ' చిత్రాన్ని ప్లాన్ చేశారు. దర్శకత్వం, నిర్మాణం, స్క్రీన్ ప్లే బాధ్యతలతో పాటు మూడు కీలక పాత్రలను తానే పోషిస్తూ అహర్నిశలు శ్రమించారు. సరిగ్గా అదే సమయంలో నిర్మాత ఆంజనేయులు 'కురుక్షేత్రం' అనే కథతో కృష్ణ దగ్గరకు వెళ్లారు. ఇందులో శోభన్ బాబు కృష్ణుడిగా, కృష్ణ అర్జునుడిగా నటించేలా ప్రాజెక్ట్ ఖరారైంది. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్.. కృష్ణను పిలిపించి, "బ్రదర్, నేను అదే సబ్జెక్టుతో సినిమా చేస్తున్నాను కదా.. మళ్లీ మీరు అదే కాన్సెప్ట్‌తో సినిమా తీస్తే ఎలా నడుస్తుంది?" అని ప్రశ్నించారు. దానికి కృష్ణ వినయంగానే సమాధానమిచ్చినప్పటికీ, తెర వెనుక ఒక గొప్ప పోటీకి పునాది పడింది.

మీ చావు మీరు చావండి
'కురుక్షేత్రం' షూటింగ్ మధ్యలో ఉండగా అనేక కష్టాలు ఎదురయ్యాయి. కృష్ణుడి పాత్రధారి శోభన్ బాబు వెనకడుగు వేయడం, నిర్మాత ఆర్థిక భారంతో చేతులెత్తేయడం వంటివి జరిగాయి. అప్పుడు కృష్ణ పెద్దాయన ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించగా.. ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా "నేను ముందే చెప్పానుగా.. వినలేదు.. మీ చావు మీరు చావండి" అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ మాట కృష్ణలో పట్టుదలను రగిల్చింది. సాక్షాత్తు ఎన్టీఆరే అంత మాట అనేసరికి, కృష్ణ ఆ సినిమాను ఛాలెంజ్‌గా తీసుకున్నారు. స్వయంగా తానే బాధ్యత తీసుకుని, భారీ వ్యయంతో సినిమాను పూర్తి చేశారు.
ఎన్టీఆర్ సినిమా ముందు కురుక్షేత్రం నిలబడలేకపోయింది
ఒకే కథతో రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ముఖాముఖి తలపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'దానవీరశూరకర్ణ' ప్రభంజనం ముందు 'కురుక్షేత్రం' నిలబడలేకపోయింది. ఎన్టీఆర్ నట విశ్వరూపం, ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ ముందు ఇతర నటుల పాత్రలు తేలిపోయాయి. కానీ, టెక్నికల్ పరంగా చూస్తే 'కురుక్షేత్రం' చాలా రిచ్‌గా తెరకెక్కింది. అందుకే కర్ణాటకలోనూ, తమిళనాడులోనూ ఆ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. బెంగళూరులో 'కురుక్షేత్రం' వంద రోజులు ఆడితే, 'దానవీరశూరకర్ణ' కేవలం రెండు వారాలకే పరిమితమైంది. ఇలా ఎన్ని వివాదాలు నడిచినప్పటికీ ఎన్టీఆర్, కృష్ణ మాత్రం ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునేవారు. కలిసి మెలిసి ఉండేవారు.












Click it and Unblock the Notifications