‘మా ఇంటి బంగారం’ రికార్డులు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవుతోంది
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ప్రస్తావన వస్తే.. ఇప్పటివరకు 'అరుంధతి' సృష్టించిన ప్రభంజనమే మొదటి గుర్తొచ్చేది. 2009లో జేజమ్మగా అనుష్క శెట్టి నెలకొల్పిన రూ.70 కోట్ల కలెక్షన్ల రికార్డును దాటడం గత 17 ఏళ్లుగా ఏ టాలీవుడ్ హీరోయిన్‌కూ సాధ్యం కాలేదు. కానీ, తాజాగా ఆ అజేయ రికార్డుకు చెక్ పెడుతూ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర లిఖించింది స్టార్ హీరోయిన్ సమంత. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూ టాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన నంబర్-1 లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా అవతరించింది.
విడుదలైన 10 రోజుల్లోనే..
విడుదలైన కేవలం 10 రోజుల్లోనే 'అరుంధతి' రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం, ప్రస్తుతం రూ.100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. విడుదలైన పదో రోజున ఈ సినిమా భారతదేశ వ్యాప్తంగా రూ.5.30 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్లు రూ.48.25 కోట్లకు (గ్రాస్ రూ.55.86 కోట్లు) చేరాయి. ఇక ఓవర్సీస్‌లోనూ సమంత క్రేజ్ మరోసారి నిరూపితమైంది. విదేశాల్లో ఈ చిత్రం ఏకంగా రూ.22.85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 'మా ఇంటి బంగారం' మొత్తం కలెక్షన్లు రూ.78.71 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి సరికొత్త మైలురాయిని అందుకున్నాయి.

ప్రేక్షకుల బ్రహ్మరథం
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పదో రోజున కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే రూ.4.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలో రూ.1.10 కోట్లు, తమిళనాడులో రూ.41 లక్షల వసూళ్లతో ఈ చిత్రం అక్కడ కూడా మంచి హోల్డ్‌ను ప్రదర్శిస్తోంది. కేవలం రూ.20 కోట్ల పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం', ఇప్పటికే తన నిర్మాణ వ్యయానికి నాలుగు రెట్లకు పైగా వసూళ్లను సాధించి డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. థియేటర్లలో ఇంకా స్ట్రాంగ్ రన్‌ను కొనసాగిస్తున్న ఈ చిత్రం.. అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మైలురాయిని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సమంత వన్-వుమెన్ షోగా నిలిచిన ఈ చిత్రం టాలీవుడ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.














Click it and Unblock the Notifications