వాస్తవానికి మహేష్‌బాబు పరిచయం అవ్వాల్సింది ‘రాజకుమారుడు’ సినిమాతో కాదు..!
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి, నేడు టాలీవుడ్‌ను ఏలుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే అంతర్జాతీయ స్థాయి స్టార్‌గా మారబోతున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న 'వారణాసి' అనే భారీ అడ్వెంచరస్ చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌తో మహేష్ బాబు కెరీర్ లెక్కలు పూర్తిగా మారిపోబోతున్నాయి. హీరోగా పరిచయమైన 27 ఏళ్ల తర్వాత ఆయన సినీ ప్రస్థానంలోనే ఇది ఒక అతిపెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలవనుంది.
1993లోనే ప్రారంభం కావాల్సి ఉంది
మహేష్ బాబు హీరోగా పరిచయమైన చిత్రం 'రాజకుమారుడు' అని మనందరికీ తెలుసు. కానీ, వాస్తవానికి ఆయన సినీ కెరీర్ అంతకంటే ఆరేళ్ల ముందే అంటే 1993లోనే ఒక క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రారంభం కావాల్సింది. అప్పట్లో టాలీవుడ్‌లో వరుస హిట్స్ ఇస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో మహేష్ బాబు మొదటి సినిమాను సూపర్ స్టార్ కృష్ణ ప్లాన్ చేశారు. 'సూర్య ఆడియో' అధినేత అన్నే శేఖర్ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. 1993 విజయదశమి రోజున ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్‌ను కూడా జరుపుతామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

లుక్ ను చూపించమని అడిగారు
మహేష్ బాబును హీరోగా లాంచ్ చేస్తున్నారనే వార్త తెలియడంతో అప్పట్లో మీడియా ప్రతినిధులు ఆయన లుక్‌ను ఒకసారి చూపించాలని కృష్ణను కోరారు. కానీ, సినిమా ముహూర్తం రోజే నేరుగా మహేష్ బాబును అందరికీ సర్ప్రైజ్‌గా చూపిస్తామని కృష్ణ నిరాకరించారు. ఈవీవీ సత్యనారాయణ కూడా మహేష్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక అద్భుతమైన టీనేజ్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీని సిద్ధం చేశారు. 1993 మే 14న ప్రముఖ సినీ పత్రిక 'శివరంజని' వీక్లీలో కూడా ఈ సినిమా గురించిన ప్రత్యేక కథనాలు వచ్చాయి.
కానీ, దురదృష్టవశాత్తూ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండానే ఆదిలోనే ఆగిపోయింది. ఒకవేళ ఆ సినిమా గనుక పట్టాలెక్కి ఉంటే మహేష్ బాబు 1993లోనే హీరోగా వెండితెరకు పరిచయం అయ్యేవారు. కానీ, ఆ తర్వాత ఆరేళ్ల నిరీక్షణకు తెరదించుతూ 1999లో రొమాంటిక్ చిత్రాల స్పెషలిస్ట్ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన 'రాజకుమారుడు' సినిమాతో ఆయన ఘనంగా ఎంట్రీ ఇచ్చారు. ప్రీతి జింటా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం కృష్ణ అభిమానుల భారీ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసి మహేష్‌ను లవర్ బాయ్‌గా నిలబెట్టింది.
మురారి బ్రేక్ ఇచ్చింది
ఆ తర్వాత వచ్చిన 'యువరాజు', 'వంశీ' చిత్రాలు మహేష్ బాబుకు పెద్దగా కలిసిరాకపోయినా, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'మురారి' సినిమా నటుడిగా ఆయనకు తొలి బ్రేక్ ఇచ్చింది. ఆపై గుణశేఖర్ తెరకెక్కించిన 'ఒక్కడు' చిత్రంతో టాలీవుడ్ స్టార్ హీరోల లీగ్‌లోకి చేరిన మహేష్, పూరీ జగన్నాథ్ 'పోకిరి' సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి తిరుగులేని 'సూపర్ స్టార్'గా అవతరించారు. అలా నాటి నుంచి నేటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన మహేష్ బాబు, ఇప్పుడు రాజమౌళి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన జైత్రయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications