‘మన శంకర వరప్రసాద్ గారు’ 50 డేస్ సెంటర్స్, కలెక్షన్స్‌లో సంచలన రికార్డు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాయాలన్నా, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవాలన్నా అది ఒక్క మెగాస్టార్ చిరంజీవికే సాధ్యమని మరోసారి నిరూపితమైంది. 2026 సంక్రాంతి బరిలోకి భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన 'మన శంకర వరప్రసాద్ గారు' భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి తన నటనతో థియేటర్లను ఊపేశారని చెప్పొచ్చు. సంక్రాంతి సెలవులను అద్భుతంగా వాడుకున్న ఈ చిత్రం, మొదటి వారం నుంచే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. దాదాపు ఐదు వారాల పాటు ఏమాత్రం తగ్గని షేర్లతో డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది.
2 వారాల్లోనే బ్రేక్ ఈవెన్
తాజాగా ఈ సినిమా 50 రోజులు పూర్తిచేసుకుంది. మొత్తం 109 కేంద్రాల్లో 50 రోజులను పూర్తి చేసుకుంది. 56 డైరెక్ట్ కేంద్రాల్లో హాఫ్ సెంచరీ కొట్టింది. ఇటీవలి కాలంలో 109 కేంద్రాల్లో 50 రోజులు ఆడటమంటే సాధారణ విషయం కాదు. రెండువారాలకే కలెక్షన్లను రాబట్టుకొని థియేటర్ల నుంచి సినిమాలు మాయమైపోతున్న తరుణంలో చిరంజీవి సినిమా 109 కేంద్రాల్లో 50 రోజులు ఆడిందంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల భారీ బిజినెస్ జరగ్గా రూ.290 కోట్ల వరకు రాబట్టింది. మరికొన్ని మీడియా సంస్థల సమాచారం ప్రకారం రూ.375 కోట్లు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ 2 వారాల్లోనేబ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి ప్రవేశించింది 'మన శంకర్ వరప్రసాద్ గారు'.

చిరంజీవి కెరీర్ లోనే తొలిసారిగా..
శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ రూపంలోనే ఈ చిత్రం విడుదలకు ముందే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. చిరంజీవి కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవడంతోపాటు సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో అత్యంత వేగంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రాల్లో ఒకటిగా ఇది రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా ఘనవిజయానికి ప్రధాన కారణం.. కుటుంబ ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు తరలిరావడమే. ఓటీటీలో కూడా మిలియన్లకొద్దీ వ్యూస్ సాధించింది. శాటిలైట్ లో విడుదలైనప్పుడు ఎంత టీఆర్పీ వస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications