2001 సంక్రాంతికి చిరు - బాలయ్య అభిమానుల మధ్య హోరాహోరీ యుద్ధం!
తెలుగు సినిమా చరిత్రలో 2001 జనవరి 11వ తేదీ ఒక ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి 'మృగరాజు', నందమూరి బాలకృష్ణ 'నరసింహ నాయుడు' థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఆ సమయంలో చిరు, బాలయ్య అభిమానులు వీటిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ సినిమా ఆడుతుందంటే, తమ సినిమా ఆడుతుందంటూ విడుదలకు నెలరోజుల ముందు నుంచే గొడవలు పడటం ప్రారంభించారు.
ఒకరి ఫ్లెక్సీలను మరొకరు చించేసుకున్నారు
హాలీవుడ్ చిత్రం 'ది ఘోస్ట్ అండ్ ది డార్క్‌నెస్' ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో మృగరాజు రాగా, 'సమరసింహా రెడ్డి' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బి. గోపాల్ దర్శకత్వంలో బాలయ్య చేసిన ఫ్యాక్షన్ డ్రామా నరసింహనాయుడు. పరుచూరి బ్రదర్స్ పవర్‌ఫుల్ డైలాగులు, మణిశర్మ సంగీతం ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. సినిమా విడుదలకు వారం రోజుల ముందే రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల వద్ద ఉద్రిక్తత మొదలైంది. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తమ హీరో కటౌట్ పెద్దదిగా ఉండాలంటే, తమ హీరో కటౌట్ పెద్దదిగా ఉండాలని ఇద్దరు హీరోల అభిమానులు పోటీపడ్డారు. కొన్ని చోట్ల ఒకరి ఫ్లెక్సీలను మరొకరు చించేసుకున్నారు. వివాదాలన్నీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి.

నల్ల రంగు పోయడం, కటౌట్లకు చెప్పుల దండ వేయడం చేశారు
కొన్ని సెంటర్లలో ప్రత్యర్థి హీరోల పోస్టర్లపై నల్ల రంగు పోయడం, కటౌట్లకు చెప్పుల దండలు వేయడంతో థియేటర్ల వద్ద భారీగా పోలీసులను మోహరించాల్సి వచ్చింది. సినిమాలు విడుదలైన మొదటిరోజే ఉద్రిక్తలన్నీ తగ్గిపోయాయి. భారీ గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ, కథనం నెమ్మదిగా ఉండటంతో 'మృగరాజు' భారీ డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి సింహంతో పోరాడే సన్నివేశాలు మినహా మిగిలిన సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 'నరసింహ నాయుడు' థియేటర్లకు వచ్చిన మొదటి ఆట నుంచే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. "నీ గడ్డ మీద ఉన్నాను.. నా గడ్డం మీద చెయ్యేయ్" వంటి డైలాగులు థియేటర్లను హోరెత్తించాయి. తొలిసారిగా తెలుగులో రూ.30 కోట్ల వసూల్లు సాధించిన సినిమాగా నరసింహనాయుడు రికార్డు సృష్టించింది. సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది. 105 కేంద్రాల్లో 50 రోజులు, 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications