తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్నారు. ఇప్పటికీ అగ్ర కథానాయకులు అంటే ఆ నలుగురే. వారి తర్వాత తరం కూడా సినిమాల్లోకి వచ్చింది. అందరూ స్టార్ హీరోలయ్యారు. పాన్ ఇండియా హీరోలుగా మారారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నారు. అయితే మన తెలుగు పరిశ్రమలో ముగ్గురు హీరోలను ముగ్గురు మొనగాళ్లు అని పిలుస్తారు. ఎందుకంటే వీరు నిజ జీవితంలో కూడా ఎంతో స్నేహంగా ఉంటారు. ఒకరి విజయానికి మరికొరు సంతోషిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు.
హాలీవుడ్ హీరో అవుతాడు
ఆ ముగ్గురు మొనగాళ్లు ఎవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మహేష్ బాబు ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయినా అభిమాన గణం మాత్రం ఆ రేంజ్ లోనే ఉంది. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఏకంగా వారణాసి పేరుతో పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను 120 దేశాల్లో విడుదల చేస్తున్నారు. వారణాసి తర్వాత హాలీవుడ్ హీరో అయిపోతాడంటూ మహేష్ అభిమానులు సంబరంగా చెప్పుకుంటున్నారు.

హాలీవుడ్ కూడా ఫిదా అయింది
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అంటే అభినయ విస్ఫోటనం అని చెప్పొచ్చు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో నవరసాలు పలికించగలిగే ఏకైక హీరో తారక్. సుదీర్ఘమైన డైలాగులను కూడా సింగిల్ టేక్ లో చెప్పడం, ఎటువంటి నటనైనా ఒక టేక్ లోనే దర్శకుడితో ఓకే చెప్పించుకోవడం ఎన్టీఆర్ ప్రత్యేకత. అందుకే దర్శకులంతా తారక్ తో ఓ సినిమా అయినా చేయాలనుకుంటారు. డ్రాగన్ తో కనీసం రూ.1500 కోట్లు ఇండియాలో వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 40 దేశాల్లో విడుదల చేస్తున్నారు. తారక్ నటన, నృత్యాలు, ఫైట్స్, భావోద్వేగాలు చూసి సీనియర్లు కూడా ఆశ్చర్యపోతుంటారు. ఆర్ఆర్ఆర్ లో నటనకు హాలీవుడ్ మొత్తం ఫిదా అయింది.
వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటారు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రతి సినిమాలోనూ ఒక కొత్త మేకోవర్‌తో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో ప్రేక్షకులను మెప్పించడంలో చరణ్ స్టైలే వేరు. రంగస్థలం వంటి సినిమాల్లో తన నటనలో మరో కోణాన్ని చూపించిన చెర్రీ ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ వేదిక వరకు వెళ్లి గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ ముగ్గురు హీరోలు తమ మధ్య ఉన్న స్నేహాన్ని కాపాడుకుంటూనే, బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నారు. వీరి అడుగుజాడల్లోనే మరికొంత మంది నటులు ముందుకు సాగుతున్నప్పటికీ, 'ముగ్గురు మొనగాళ్లు' గా వీరు సృష్టించిన ప్రభావం మాత్రం తెలుగు సినీ పరిశ్రమపై చెరిగిపోలేనిది.












Click it and Unblock the Notifications