ఏపీలో డెంగీ విజృంభణ -ఏడు రోజుల్లో 225 కేసులు : లక్షణాలు - మార్గదర్శకాలు..!!
ఏపీలో డెంగీ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో డెంగీ విజృంభిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విశాఖ జిల్లాలో కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. గత వారం రోజుల్లో నమోదైన కేసుల్లో దాదాపుగా 39 శాతం ఇక్కడే నమోదయ్యాయి. అయితే, వారం రోజుల సమయంలో 225 కేసులు నమోదైనట్లు ప్రభత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో..అప్రమత్తమైన ఆరోగ్య శాక మరో 30 ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలకు అనుమతి ఇచ్చింది.

ఏపీలో పెరిగిపోతున్న డెంగీ-చికెన్ గున్యా కేసులు
గత ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు వరకు మొత్తం 1,388 డెంగీ కేసులు నమోదు కాగా, అందులో ఆగస్టు 23-29 మధ్యలోనే 225 కేసులున్నాయి. ఇందులో ఒక్క విశాఖలోనే 87 కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసుల్లోనూ అంతే. 48 కేసులు వారం రోజుల్లో నమోదైతే అందులో 36 కేసులు విశాఖపట్నం జిల్లాలో నమోదయ్యాయి. చికున్ గున్యా కేసులు కూడా ఈ ఏడాది ఇప్పటివరకూ 25 నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిల్వ ఉంటే అక్కడ డెంగీ దోమలు సంతానోత్పత్తి చేస్తుంటాయని అధికారులు చెబుతున్నారు.

విశాఖ జిల్లాలో అత్యధికంగా నమోదు
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి ఆరోగ్య సర్వేలో అటువంటి పరిస్థితులను గుర్తిస్తున్నారు. అయితే, ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ అదుపులోనే ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 24 ఆస్పత్రుల్లో మాత్రమే డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఇవి అందరికీ అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో మరో 30 ఆస్పత్రుల్లో చేస్తున్నారు. త్వరలోనే విశాఖలో డెంగీని అదుపులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య అధికారులు స్పష్టం చేస్తున్నారు.

డెంగీ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
ఇదే సమయంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు డెంగీ లక్షణాలు ఎలా ఉంటాయి.. దాని చికిత్సకు మార్గదర్శకాల గురించి వైద్యులు అప్రమత్తం చేస్తున్నారు. సాధారణంగా..డెంగీ జ్వరం ఈడిస్ దోమ కుట్టడంవల్ల వస్తుంది. దోమ కుట్టిన 24 గంటల్లోనే విపరీతమైన తలనొప్పి వస్తుంది. జ్వరం మొదలయి.. జ్వర తీవ్రత పెరిగేకొద్దీ కళ్లు ఎర్రగా మారుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. మరుసటి రోజు కండరాల నొప్పి తీవ్రమవుతుందని..అనంతరం కీళ్ల నొప్పులు పెరుగుతాయని పేర్కొంటున్నారు.

వైద్యులు సూచిస్తున్న మార్గదర్శకాలు..
ఇక, వీటితో పాటుగా..శరీరమంతా దద్దుర్లు మొదలై, అవి ఎర్రగా మారతాయని చెప్పుకొచ్చారు. డెంగీ వచ్చిన వారికి ఆహారం తినాలనిపించదు.. తీసుకున్నా వాంతులవుతాయని ఇవి గుర్తించాలని సూచించారు. అదే విధంగా.. డెంగీ హీమరోజిక్ ఫీవర్ (డీహెచ్‌ఎఫ్) అంటే ఎక్కువ తీవ్రత ఉన్నట్టు లెక్క గా గుర్తిస్తామన్నారు. ఇక చివరి దశ అంటే డెంగీ షాక్ సిండ్రోమ్ (డీఎస్‌ఎస్) అంటారని వైద్యులు విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో చికిత్సకు మార్గదర్శకాలను వైద్యులు సూచిస్తున్నారు.
Recommended Video

వైద్యుల చికిత్స..పరిశుభ్రతే అసలు మందు
డెంగీ జ్వరాన్ని ఎలీశా టెస్టు ద్వారా నిర్ధారిస్తారని..ఫిజీషియన్ సూచనల మేరకు మాత్రమే యాంటీబయోటిక్స్ ఇవ్వాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇక, తాజాగా యాంటీవైరల్ ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. జ్వర తీవ్రతను తగ్గించేందుకు తరచూ పారాసెటిమాల్ ఇవ్వాలని.. రోగికి పళ్లు, పళ్ల రసాలు మాత్రమే ఆహారంగా ఇవ్వాలని వైద్యుల సూచనగా ఉంది. పరిస్థితిని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సి ఉంటుందని చెబుతున్న వైద్యులు.. రోగికి వీలైనంత ఎక్కువ మోతాదులో నీళ్లు తాగించాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications