ఉద్యోగ నోటిఫికేషన్లు సిద్దం - ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు..!!
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్ విడుదలకు సిద్దమైంది. 2,686 ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగు తోంది. గతంలో భర్తీ చేయాల్సిన వాటితో పాటుగా ఇప్పుడు కొత్తవీ కలిపి ఈ ఏడాది భర్తీ చేసేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. 1,016 పోస్టులకు కొత్తగా 19 నోటిఫికేషన్లు జారీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఇప్పటికే జారీ చేసిన వాటిలో 1,670 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వాటి ల్లో కీలకమైన 150 గ్రూప్-1 ఉద్యోగాలు ఉన్నాయి. వర్సిటీలు, ఆర్జీయూకేటీల్లో 3 వేలకు పైగా ఖాళీలు సైతం భర్తీ దిశగా ఆలోచన చేస్తున్నారు.
నోటిఫికేషన్లు
ఏపీపీఎస్సీ ఈ నెల 12న జాబ్ నోటిఫికేషన్ జారీకి కసరత్తు కొనసాగిస్తోంది. కీలకమైన 150 గ్రూప్-1 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో 866 ఖాళీలను ఈ ఏడాదిలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం కొత్తగా 19 నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. గత ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో నోటిఫికేషన్లు జారీచేసినా వాటి భర్తీ ప్రక్రియను మాత్రం పూర్తిచేయలేదు. అనేక నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో నిలిచిపోయింది. దీంతో కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు పాత వాటిని పూర్తిచేయడం కోసం ఏపీపీఎస్సీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో పలు కేటగిరీల పోస్టులు ఉన్నాయి.

ప్రణాళికలు
ప్రధానంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్-7, ఇంటర్ విద్యలో లైబ్రేరియన్ సైన్స్ జూనియర్ లెక్చరర్- 2, మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీసెస్-11, అగ్రికల్చర్ ఆఫీసర్-10, హార్టికల్చర్ ఆఫీసర్-2, ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్-3, గ్రౌండ్ వాటర్ టెక్నికల్ అసిస్టెంట్-4, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్-100, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్-256 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అనంతరం ఈ నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేయాలని నిర్ణయించింది. అదే విధంగా 987 పోస్టులకు గతేడాది జూలైలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మెయిన్స్ జరగాల్సిన గ్రూప్-1 పోస్టులు 89, పాలిటెక్నికల్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు 99, ఇంటర్ విద్యలో జూనియర్ లెక్చరర్లు 47, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు 290 పోస్టులు ఉన్నాయి.
కసరత్తు
ఇప్పటికే జారీ అయిన నోటిఫికేషన్లను ఈ ఏడాది జూన్ లోగా పూర్తి చేసే విధంగా ఏపీపీఎస్సీ ప్రణాళి కలు సిద్దం చేస్తోంది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23న జరుగుతుంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మే నెలలో, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ పోస్టుల పరీక్షలు జూన్‌లో నిర్వహించేలా షెడ్యూలు సిద్దం చేసింది. అలాగే కొత్త నోటిఫికేషన్లను జూలై నుంచి డిసెంబరు నాటికి పూర్తిచేయాలని భావిస్తోంది అయితే త్వరలో విడుదల చేసే డీఎస్సీ పరీక్షల తేదీలు, ఏపీపీఎస్సీ పరీక్షలు ఒకేసారి రాకుండా కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో యూనివర్సిటీ లు, ఆర్జీయూకేటీల్లో 3వేలకు పైగా ఖాళీలను కూడా ఈ ఏడాదే భర్తీ చేయాలని భావిస్తోంది.












Click it and Unblock the Notifications