బెంగళూరు ఐటీ కంపెనీల్లో కన్నడ రచ్చ-సీఎం హెచ్చరికలూ బేఖాతర్..!
కర్నాటక రాజధాని బెంగళూరులో ఐటీ కంపెనీలు (Bengaluru IT Companies) ఇప్పుడు వణుకుతున్నాయి. దీనికి కారణం వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి మరీ ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, కంపెనీలు స్థాపిస్తున్నవారిపై కన్నడ రక్షా వేదిక సభ్యులు వ్యక్తం చేస్తున్న ఆగ్రహావేశాలే. స్ధానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ మరోసారి కన్నడ రక్షా వేదిక సభ్యులు బెంగళూరు ఐటీ కంపెనీలకు వెళ్లి హల్ చల్ చేస్తున్నారు. దీంతో ఆయా కంపెనీలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడుతున్నాయి. ఇదంతా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.
కన్నడిగులకు బెంగళూరు కంపెనీల ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ తో గతంలో పలు మార్లు ఉద్యమాలు జరిగాయి. కనీసం స్థానికులకు వీటిలో రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్లూ ఉన్నాయి. అయితే పూర్తిగా ప్రతిభ ఆధారంగా సిబ్బందిని నియమించుకునే ఐటీ కంపెనీలు .. ఈ డిమాండ్లకు తలొగ్గేందుకు సిద్దంగా లేవు. దీంతో వారు ఇప్పటికే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ఆశ్రయించారు. ఆయన కూడా బెంగళూరు ఐటీ కంపెనీలను కెలకొద్దంటూ కన్నడ రక్షా వేదిక సహా ఇతర సంఘాలకూ సూచించారు. అయినా నగరంలోని కంపెనీలకు ఈ కన్నడ రచ్చ మాత్రం ఆగడం లేదు.

తాజాగా కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు బెల్లందూరులోని వెల్స్ ఫార్గో బెంగళూరు కార్యాలయాన్ని సందర్శించి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. అంతే కాదు కన్నడిగులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కంపెనీ చేపడుతున్న నియమకాల్ని వారు పరిశీలించారు. ఇలా కన్నడ స్ధానికత పేరుతో కంపెనీల్లోకి ఇష్టారాజ్యంగా దూరి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగడాన్ని ఇండస్ట్రీ సీరియస్ గా తీసుకుంటోంది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి చెప్పి చూద్దామని ఓ ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే కన్నడ క్రియాశీలత పేరుతో జరిగే బెదిరింపులు, వేధింపుల నుండి వ్యాపార సంస్థలకు రక్షణ కల్పిస్తామని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హామీ ఇచ్చారు. అయినా వీరి ఆగడాలు ఆగడం లేదు. అయితే సీఎం డీకేశీ.. అర్హులైన స్థానికులకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించాలని కంపెనీలను కోరారు.














Click it and Unblock the Notifications
