బెంగళూరు- కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ రూట్ లో భారీగా ట్రాఫిక్ డైవర్షన్: 18 నెలల పాటు అమలు
బెంగళూరు వాహనదారులు.. ప్రత్యేకించి నగర శివార్లలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు ఇచ్చారు. నగరం నుంచి విమానాశ్రయాన్ని కలిపే అత్యంత రద్దీ మార్గంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయి. బెంగళూరు అభివృద్ధి సంస్థ ఈ పనులు చేపట్టింది. ఇక్కడ ఓ భారీ ఫ్లైఓవర్, ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించబోతోంది. ఫలితంగా ఈ రూట్ లో వాహనాలను మళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. దాదాపుగా 18 నెలల పాటు ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉండబోతోంది.
బళ్లారి రోడ్డులోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ స్టాఫ్ క్వార్టర్స్ నుంచి మేఖ్రి సర్కిల్ వరకు 1.6 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మితం కానుంది. సుమారు రూ. 420 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. వాహనాల రద్దీని తగ్గించడానికి, నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి వీలుగా ట్రాఫిక్ ను మళ్లించారు. ఈ రూట్ లో కేఎస్‌ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, లారీలు, ఇతర భారీ సరుకు రవాణా వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు.

- విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు సమయానికి టెర్మినల్ చేరుకోవడానికి వీలుగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డైవర్షన్ మార్గాలను సూచించారు. మెజస్టిక్ కెంపెగౌడ్ బస్ స్టేషన్, కేఆర్ మార్కెట్, ఎంజీ రోడ్, కబ్బన్ పార్క్, విధాన సౌధ వంటి సిటీ సెంటర్ ఏరియాల నుంచి ఎయిర్ పోర్టుకు బయలుదేరే వాహనాలు ఓల్డ్ హై గ్రౌండ్స్ జంక్షన్, కల్పనా జంక్షన్, ఓల్డ్ ఉదయ్ టీవీ జంక్షన్, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ మీదుగా ట్యానరీ రోడ్డుకు చేరుకోవాలి. అక్కడి నుంచి నాగవార రోడ్డు గుండా ఔటర్ రింగ్ రోడ్డును చేరుకుని విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంటుంది.
- యశ్వంతపూర్, బెంగళూరు పశ్చిమ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి వెళ్లే వాహనదారులు మత్తికెరె మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మత్తికెరె ఫ్లైఓవర్ మీదుగా గోకుల్ ను దాటిన అనంతరం బీఈఎల్ సర్కిల్ వద్ద కుడి మలుపు తీసుకుని రింగ్ రోడ్డు మీదుగా హెబ్బాళ్ వైపు వెళ్లాలి. హెబ్బాళ ఫ్లైఓవర్ మీదుగా నేరుగా విమానాశ్రయానికి చేరుకోవచ్చు.
- విమానాశ్రయం లేదా హెబ్బాళ్ వైపు నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు కూడా నిర్ణీత ప్రత్యామ్నాయ రూట్లలోనే ప్రయాణించాలి. హెబ్బాళ జంక్షన్ వద్ద ఎడమవైపునకు తిరిగి నాగవార జంక్షన్, బాంబూ బజార్, క్వీన్స్ రోడ్డు ద్వారా సిటీలోకి సెంటర్ ఏరియాలకు వెళ్లవచ్చు. అలాగే.. హెబ్బాళ వద్ద కుడి మలుపు తీసుకుని భద్రప్ప లేఅవుట్ ఫ్లైఓవర్, రింగ్ రోడ్డు, కువ్వెంపు సర్కిల్, బీఈఎల్ అండర్ పాస్ మీదుగా గొరగుంటపాళ్య జంక్షన్ నుంచి డాక్టర్ రాజ్‌కుమార్ రోడ్డు గుండా నగరంలోకి రావచ్చు.
- మేఖ్రీ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్లు గానీ, దానికి ఆనుకుని ఉన్న ఆర్టీ నగర్, ఆనంద్ నగర్ వైపు వెళ్లే ప్రయాణికుల కోసం హెబ్బాళ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని బాప్టిస్ట్ ఆసుపత్రి ముందు ఉన్న సర్వీస్ రోడ్డును అందుబాటులో తెచ్చారు. హెబ్బాళ్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఈ సర్వీస్ రోడ్డు ద్వారా సీబీఐ జంక్షన్ వరకు వెళ్లి, అక్కడి నుంచి ఆనంద్ నగర్ మెయిన్ రోడ్డు ద్వారా ఆర్టీ నగర్, జయమహల్ రోడ్డుకు చేరుకోవచ్చు. యశ్వంతపూర్ నుంచి వచ్చే వాహనాలు బీహెచ్‌ఈఎల్ జంక్షన్, మార్గోసా రోడ్డు మీదుగా వెళ్లవచ్చు.
https://t.co/X3hdygNcXw
— ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) November 5, 2026
ఈ నిర్మాణ పనుల దృష్ట్యా.. విమానాశ్రయానికి వెళ్లే వాళ్లు తమ ప్రయాణ సమయానికి ముందే బయలుదేరాలని ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు సూచించారు. విమాన సమయానికి కనీసం రెండు గంటల ముందే ఇళ్ల నుంచి బయలుదేరడం శ్రేయస్కరమని పేర్కొన్నారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ప్రయాణించేవారు లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్లను పరిశీలిస్తూ, పోలీసుల సూచనలను పాటించాలని కోరారు.













Click it and Unblock the Notifications
