ఐటీ నియామకాల్లో సరికొత్త మార్పులు: ఈ స్కిల్స్ లేకపోతే కెరీర్ ప్రమాదంలో పడినట్టే!
ఐటీ రంగంలో గత రెండేళ్లుగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఓవైపు భారీ ఎత్తున లేఆఫ్స్, మరోవైపు స్కిల్స్ ఆధారంగా జరిగే రిక్రూట్ మెంట్లు ఈ ఉద్యోగాల డిమాండ్ ను తగ్గించేశాయి. అయితే మరోవైపు కొత్త స్కిల్స్ ఉన్న వారికి మాత్రం డిమాండ్ యథాతథంగానే ఉంది. దీంతో దేశీయ ఐటీ రంగంలో గత రెండేళ్లుగా సాగిన భారీ లేఆఫ్‌ల పర్వం దాదాపు ముగిసినప్పటికీ, ఉద్యోగ నియామకాల శైలిలో (Indian IT Recruitment Trend )పెను మార్పులు చోటుచేసుకొంటున్నాయనే చెప్పవచ్చు.
ఐటీ జాబ్ రిక్రూట్ మెంట్స్ ట్రెండ్ (IT Recruitment)
ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు కేవలం ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడం కంటే, అత్యుత్తమ ఉత్పాదకతను సాధించడంపైనే దృష్టి సారిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త సాంకేతిక విభాగాల విస్తృతి వల్ల సాంప్రదాయ ఉద్యోగాల స్వరూపం వేగంగా మారిపోతోంది. తాజా గణాంకాల ప్రకారం, ప్రధాన ఐటీ కంపెనీల ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఒక ఉద్యోగి రాజీనామా చేస్తే వెంటనే ఆ స్థానంలో కొత్తవారిని నియమించుకునే 'వన్-టు-వన్ బ్యాక్‌ఫిల్లింగ్' పద్ధతిని కంపెనీలు నిలిపివేస్తున్నాయి. ఖాళీగా ఉన్న స్థానాలను అలాగే ఉంచుతూ, ఇతర అంతర్గత సిబ్బంది ద్వారా లేదా కొత్త నైపుణ్యాలు కలిగిన స్పెషలిస్ట్ ఫ్రెషర్లను నియమించుకుంటూ పనులను సర్దుబాటు చేస్తున్నాయి. ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వారిని పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్‌ల పరిధిలోకి తీసుకువస్తున్నాయి.

మిడిల్ మేనేజ్మెంట్ ఉద్యోగాలపై పెరిగిన ఒత్తిడి
ప్రస్తుతం నిత్యం ఒకే తరహా విధులను నిర్వర్తించే సాధారణ ఐటీ పనులు, ఎంట్రీ లెవెల్ కోడింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ , డేటా ప్రాసెసింగ్ వంటి విభాగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇలాంటి మానవీయ సేవలను ఆధునిక ఏఐ టూల్స్ వేగంగా పూర్తి చేస్తుండటంతో మానవ వనరుల అవసరం తగ్గుతోంది. దీంతో పాటు సమన్వయ బాధ్యతలను మాత్రమే చూసే మధ్యస్థాయి మేనేజ్‌మెంట్ పొజిషన్లను కూడా కంపెనీలు మార్చేస్తున్నాయి. ఫలితంగా ఈ విభాగాల్లోని సిబ్బంది ఇతర కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

డిమాండ్‌లో ఉన్న సరికొత్త నైపుణ్యాలు
ఈ డిజిటల్ మార్పుల వల్ల క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి సరికొత్త నైపుణ్యాలు కలిగిన నిపుణులకు మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంది. ఉద్యోగుల స్వచ్ఛంద రాజీనామాలు కూడా ఇప్పుడు భారీగా తగ్గాయి. అయితే, భవిష్యత్ నైపుణ్యాల శిక్షణ అందించని కంపెనీలను వీడి, మెరుగైన ఆప్ స్కిల్లింగ్ అవకాశాలు ఇచ్చే సంస్థల వైపు నిపుణులు మొగ్గు చూపుతున్నట్లు వివిధ సర్వేలు పేర్కొంటున్నాయి. మొత్తంగా చూస్తే, భారత ఐటీ రంగం నియామకాల పరంగా పరిమాణం నుంచి నాణ్యత వైపు అడుగులు వేస్తోంది. సాంప్రదాయ పద్ధతుల్లో పనిచేసే పాత తరం నిపుణుల కంటే, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సమస్యలను పరిష్కరించగల టాలెంట్ ఉన్నవారికే అత్యధిక ప్రాధాన్యత దక్కుతోంది. రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత నైపుణ్యాలను నిరంతరం అలవర్చుకుంటూ తమను తాము అప్‌గ్రేడ్ చేసుకునే వారే ఐటీ పరిశ్రమలో నిలదొక్కుకోగలరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
