Bima Sakhi Yojana:గ్రామీణ మహిళలకు గుడ్ న్యూస్ - ఎల్‌ఐసీ నుంచి కొత్త స్కీమ్,హైలైట్స్ ఇవే..!
మహిళల సాధికారిత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కొన్ని ప్రత్యేక పథకాలను తీసుకొస్తుంటాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భాగస్వామ్యంతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దానిపేరే బీమా సఖీ యోజన.ఈ పథకం ఏంటి.. దీని పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
బీమా సఖీ యోజన పథకాన్ని ఎల్‌ఐసీ ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలకు ఈ పథకంతో ఉపాధి కల్పించడం, ఆర్థిక స్వేచ్ఛను కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన పథకం.ఈ పథకంలో భాగంగా 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను గుర్తించి వారికి సరైన ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత వీరిని ఏజెంట్లుగా నియమిస్తారు. అయితే ఈ అవకాశం పొందాలంటే 10వ తరగతి తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలనే నిబంధన పెట్టారు. ఇక ట్రైనింగ్ సమయంలో స్టయిపెండ్ కూడా చెల్లిస్తారు. వీరిని బీమా సఖీలుగా పిలుస్తారు.

బీమా సఖీ యోజన ఫీచర్లు:
శిక్షణ మరియు ఉపాధి: బీమా సఖీ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా అర్హత కలిగిన లక్ష మంది మహిళలను గుర్తించి వారిని బీమా ఏజెంట్లుగా నియమిస్తారు. అంతకుముందు శిక్ష ఇస్తారు.దీని ద్వారా వారు బీమా రంగం గురించి తెలుసుకోవడమే కాకుండా బీమా పాలసీలను ఎలా అమ్మాలో అనే అంశంపై నైపుణ్యత సాధిస్తారు. దీని ద్వారా వారు ఆర్థికంగా కూడా బలపడతారు.
ఆర్థికంగా బలోపేతం: ఇక ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ ఇచ్చే సమయంలో అంటే నెలకు కొంత మొత్తం స్టయిఫెండ్ రూపంలో చెల్లిస్తారు. ఇందులో భాగంగా తొలి ఏడాది రూ.7వేలు, రెండవ ఏడాది రూ.6వేలు, మూడవ ఏడాది రూ.5వేలు చెల్లిస్తారు. ఈ స్టయిపెండ్‌తో మహిళలు ఆర్థికంగా బలపడుతూనే ఎల్ఐసీలో మెలుకువలు నేర్చుకుంటారు.
గ్రామీణ ప్రాంత మహిళల సాధికారత: బీమా సఖీ యోజన పథకం ప్రాథమిక ఉద్దేశం గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించడం. స్థిరమైన ఆదాయం ఉండేలా చూడటం. ప్రధానంగా కొన్ని గ్రామాల్లో అయితే మహిళలకు చాలా తక్కువగా ఉపాధి అవకాశాలు ఉంటాయి లేదా అసలు ఉండవు. ఇలాంటి వారిని గుర్తించి వారికి ఆర్థిక భరోసానిస్తూ ఉపాధిని కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది.
మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మహిళల సాధికారతలో భాగంగా బీమా సఖీ యోజన పథకం తీసుకురావడంపై మహిళా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అది కూడా మహిళలకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం చాలా ఉపయోగకరంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పురుషాధిక్య సమాజంలో ఇలాంటి పథకాలు తీసుకొచ్చి మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంతో పాటు తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబాన్ని పోషించుకునేందుకు ఇలాంటి పథకాలు చాలా అవసరమనే అభిప్రాయం ఉంది.












Click it and Unblock the Notifications