Budget 2024: ఈసారి విద్యారంగం అంచనాలివే- ఎడ్ టెక్, ఏఐ, జీఎస్టీ స్లాబుల సహా..
వచ్చే ఆర్ధిక సంవత్సరంలో తొలి మూడు నెలల కోసం పార్లమెంటులో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో కేటాయింపులు, మినహాయింపుల కోసం మిగతా అన్ని రంగాల్లాగే కీలకమైన విద్యారంగం కూడా ఎదురుచూస్తోంది. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం, జీఎస్టీ మినహాయింపులు ఇలా చెప్పుకుంటూ పోతే విద్యారంగం ఆశిస్తున్న అంశాల జాబితా చాలానే కనిపిస్తోంది.
ఈసారి కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు పెరగాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే దేశంలో మారుతున్న పరిస్ధితులకు అనుగణంగా విద్యారంగాన్ని, విద్యార్ధులను సిద్ధం చేయాలంటే ఇవన్నీ తప్పనిసరి కానున్నాయి. ఇలా చేపట్టాల్సిన మార్పుల్లో ఎడ్యుటెక్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వంటివి ఉన్నాయి. వీటిని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో ప్రవేశపెట్టాలంటే భారీ ఎత్తున నిధుల కేటాయింపులు అవసరం అవుతాయి.

కోవిడ్ తర్వాత మారిన పరిస్ధితుల్లో ఎడ్ టెక్ రంగం ప్రాధాన్యత బాగా పెరిగింది. ముఖ్యంగా ఎక్కడి నుంచి అయినా కోర్సులు నేర్చుకునేందుకు వీలుగా పలు ప్లాట్ ఫామ్ లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని మరింత పెంచడంతో పాటు ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోర్సులు, హైబ్రిడ్ కోర్సుల్ని కూడా ప్రోత్సహించాలి. వీటిని ప్రోత్సహించేందుకు ఆయా సంస్ధలకు భారీగా నిధుల లభ్యత, కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎడ్యుకేషన్ సర్వీసులపై జీఎస్టీ స్లాబ్ లను తగ్గించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అలాగే ఆయా సేవల్లో కృత్రిమ మేథ వాడకం పెంచేందుకు నిధులు అవసరం.
ఎడ్యుకేషన్ సర్వీసులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ స్లాబ్ రేటును 18 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని ఎడ్ టెక్ సంస్ధలు కోరుతున్నాయి. అలాగే విద్యారంగంలో ఏఐ వాడకాన్ని పెంచేలా కేంద్రం పలు చర్యలు ప్రకటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు యువతలో స్కిల్స్ పెంచేందుకు కొత్త కోర్సుల్ని, నిధుల లభ్యతను పెంచాలని కోరుతున్నారు. వీటిపై ఈ తాత్కాలిక బడ్జెట్ లో ఆర్ధికమంత్రి చేసే కేటాయింపులపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications