క్యాంపస్ రిక్రూట్మెంట్స్ జోరు.. లక్షల్లో వేతనాలు..!
సాఫ్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. త్వరలో రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్ మెంట్స్ ఊపందుకోనున్నాయి. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇదో సువర్ణావకాశంగా చెప్పొచ్చు. ఉస్మానియా, జేఎన్‌టీయూ యూనివర్సిటీలలోని విద్యార్థుల కోసం భారీగా ఉద్యోగ అవకాశాలు ఉండనున్నట్లు సమాచారం. విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీలు.. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో భారీ సంఖ్యలో ఫ్రెషర్స్ ను తీసుకోవాలన్న యోచనలో ఉన్నాయి.
మొదటి ప్రాధాన్యం వారికే..
ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎస్‌ఈ)తో పాటు ఇంజినీరింగ్‌లో ప్రధాన విభాగాలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల విద్యార్థులకు బహుళజాతి సంస్థలు మొదటి ప్రాధాన్యమిస్తున్నాయి. ఓయూ, జేఎన్‌టీయూలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ వారిలో 85శాతం మందికి ట్రైనీ ఇంజినీర్లు, ఇంటర్న్‌షిప్‌లు లభించాయి ఎలక్ట్రానిక్స్ విభాగంలో 50శాతం మందికి, సివిల్ ఇంజినీరింగ్‌లో 38 శాతం, మెకానికల్‌లో 32 శాతం, ఎలక్ట్రికల్‌లో 35శాతం మందికి ఉద్యోగాలు లభించాయి.

రెండు మూడు నెలల్లో..
జేఎన్‌టీయూలో రెండు, మూడు నెలల్లో మరికొన్ని సంస్థలు ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన విద్యార్థుల్లో 70శాతం మందికిపైగా ట్రైనీ ఇంజినీర్లుగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతేడాది 562 మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలలో పాల్గొంటే వారిలో సుమారుగా 446 మందికి జాబ్స్ వచ్చినట్లు సమాచారం.
నైపుణ్యాలకు కార్యాచరణ
బహుళజాతి సంస్థల (ఎమ్‌ఎన్‌సీ) ప్రతినిధులు అవసరమైన వారిని ఎంపిక చేసేందుకు ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు? ఎలాంటి ప్రమాణాలను పాటిస్తున్నారన్న విషయాలను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ స్కిల్స్‌ను విద్యార్థుల్లో పెంచేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించారు. నగర పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఐటీహబ్‌లు వస్తుండటంతో భవిష్యత్తులో ప్రాంగణ నియామకాల ప్రాధాన్యతను అధికారులు వివరిస్తున్నారు.
లక్షల్లో వేతనాలు
ఓయూ, జేఎన్‌టీయూ యూనివర్సిటీల్లో జరిగిన క్యాంపస్ రిక్రూట్ మెంట్స్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల్లో కొందరికి రూ.లక్షల్లో జీతాలు దక్కనున్నాయి. తాజాగా ఓయూలో ఇద్దరు విద్యార్థులు రూ.26 లక్షలు, జేఎన్‌టీయూలో ఓ విద్యార్థి రూ. 52లక్షలు, మరో విద్యార్థి రూ. 25.97లక్షల వార్షిక వేతన ప్యాకేజీ అందుకున్నారు.












Click it and Unblock the Notifications