CBSE: సిలబస్ లో పెను మార్పులు, ఒకే సబ్జెక్టు.. రెండు లెవల్స్
దేశంలోని అతిపెద్ద విద్యా బోర్డు సీబీఎస్‌ఈ (CBSE), జాతీయ విద్యా విధానం (NEP 2020) స్ఫూర్తితో తన రూపురేఖలను మార్చుకుంటోంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు విద్యార్థులపై పెను ప్రభావాన్ని చూపనున్నాయి. ముఖ్యంగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు నేర్చుకునే సబ్జెక్టుల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బోర్డు ఛైర్మన్ రాహుల్ సింగ్ ఈ వినూత్న మార్పులను గురువారం అధికారికంగా వెల్లడించారు.
ఇకపై ఆరో తరగతిలో చేరే విద్యార్థులకు 'థర్డ్ ల్యాంగ్వేజ్' (R3) తప్పనిసరి కానుంది. గతంలో ఉన్న రెండు భాషలకు తోడుగా అదనంగా మరో భాషను అభ్యసించాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రకారం విద్యార్థులు కనీసం రెండు భారతీయ భాషలను నేర్చుకోవాలి. ప్రస్తుతం 6వ తరగతిలో ఈ విధానాన్ని ప్రారంభిస్తుండగా.. వీరు 2031లో తమ పదో తరగతి బోర్డు పరీక్షలు రాసే సమయానికి ఈ త్రిభాషా సూత్రం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుంది. అప్పుడు విద్యార్థులు మూడో భాషగా ఇంగ్లీష్ లేదా ఏదైనా విదేశీ భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది.

గణితం, సైన్స్‌లో 'అడ్వాన్స్‌డ్' లెవల్..
తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం సీబీఎస్‌ఈ ఒక ఆసక్తికరమైన వెసులుబాటు కల్పించింది. గణితం (Mathematics), సైన్స్ సబ్జెక్టులను ఇప్పుడు రెండు స్థాయిల్లో అందిస్తారు. ఎవరైనా విద్యార్థి సబ్జెక్టుపై పట్టు సాధించి 'అడ్వాన్స్‌డ్ లెవల్' ఎంచుకుంటే, వారు సాధారణ పరీక్షతో పాటు అదనంగా 25 మార్కులకు మరో గంట పాటు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి మార్క్‌షీట్‌లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. 2028 బోర్డు పరీక్షల నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.
ఏఐ (AI), కంప్యూటేషనల్ థింకింగ్ తప్పనిసరి..
మారుతున్న కాలానికి అనుగుణంగా 9, 10 తరగతుల విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (Artificial Intelligence), కంప్యూటేషనల్ థింకింగ్ సబ్జెక్టులను తప్పనిసరి చేశారు. ప్రస్తుతానికి వీటిని పాఠశాల స్థాయి మూల్యాంకనానికే పరిమితం చేసినప్పటికీ, 2029 నాటికి ఇవి పదో తరగతి బోర్డు పరీక్షల్లో కీలక సబ్జెక్టులుగా మారనున్నాయి. అలాగే, 2027-28 నుండి వృత్తి విద్యా కోర్సులు (Vocational Courses) కూడా తప్పనిసరి సబ్జెక్టుల జాబితాలోకి చేరనున్నాయి.
కళలు, క్రీడలకూ ప్రాధాన్యం..
చదువుతో పాటు శారీరక, మానసిక వికాసం కోసం కళా విద్య (Art Education), శారీరక విద్య (Physical Education)ను 9, 10 తరగతులకు తప్పనిసరి చేయాలని బోర్డు యోచిస్తోంది. వీటికి ప్రస్తుతం పాఠశాల ఆధారిత గ్రేడింగ్ మాత్రమే ఉంటుంది. విదేశాల్లోని సీబీఎస్‌ఈ పాఠశాలలకు మాత్రం భారతీయ భాషల విషయంలో కొంత వెసులుబాటు కల్పించారు. దీనికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు, అభ్యసన సామాగ్రిని ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) సహకారంతో ఈ నెలలోనే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అకడమిక్స్ డైరెక్టర్ ప్రజ్ఞ సింగ్ తెలిపారు.
మొత్తానికి, సీబీఎస్‌ఈ తీసుకువచ్చిన ఈ మార్పులు విద్యార్థులను గ్లోబల్ పోటీకి సిద్ధం చేయడమే కాకుండా, వారి సహజ సామర్థ్యాలను వెలికితీసేలా ఉన్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications