JEE Main 2025: మరో ఎగ్జామ్ సెంటర్ మార్చిన ఎన్టీఏ..రీజన్ ఇదే..!
జాతీయ స్దాయిలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహణలో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తప్పిదాలు, సవరణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల అభ్యర్ధులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల మార్పులతో పాటు సుదూర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ తాజాగా మరో మార్పు చేసింది.
ఈ నెల 28, 29, 30 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షల కోసం కేటాయించిన ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ పరీక్షా కేంద్రాన్ని చివరి నిమిషంలో వారణాసికి మారుస్తూ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ సెంటర్లో పరీక్షలు రాయాల్సిన అభ్యర్ధులకు సమాచారం పంపిస్తోంది. ఆయా సెంటర్లలో జరగాల్సిన పరీక్షలకు సంబంధించి అభ్యర్ధులకు అడ్మిట్ కార్డుల్ని ఇప్పటికే ఎన్టీఏ వారికి పంపింది.

అయితే ఇలా ప్రయాగ్ రాజ్ లో ఉన్న జేఈఈ మెయిన్ పరీక్షా కేంద్రాన్ని వారణాసికి మార్చడం వెనుక ఓ కీలక కారణం ఉంది. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా జరుగుతోంది. ఇందులో దేశ విదేశాలకు చెందిన లక్షలాది భక్తులు హాజరవుతున్నారు. దీంతో విద్యార్థులకు ప్రయాణ అంతరాయాలను నివారించడానికి ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్ రాజ్‌లోని పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి పలువురు విద్యార్థులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తూ ఎన్టీఏకు వినతులు పంపారు. దీనిపై స్పందించిన ఎన్టీఏ తాజా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం జనవరి 28, 29, 30 తేదీల్లో జరిగే పరీక్షలు రాయాల్సిన అభ్యర్ధులు ఈ మార్పు గమనించాల్సి ఉంది. మారిన పరీక్షా కేంద్రానికి సంబంధించిన అడ్మిట్ కార్డుల్ని ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications