Job-Hopping: ఉద్యోగాలు మారితే తప్పేంటి ? Gen Zకి షార్క్ ట్యాంక్ జడ్జి కెరీర్ టిప్స్..!
జెన్ జీ యువత తరచుగా ఉద్యోగాలు మారడంపై స్పందించిన షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జి అనుపమ్ మిట్టల్ వారికి కెరీర్ పరంగా పలు టిప్స్ ఇచ్చాడు.
మన దేశంలో యువత ఓవైపు ఉద్యోగాలు పోతాయనే భయంతో, మరోవైపు కెరీర్ లో గ్రోత్ ఉండాలనే ఆలోచనతో తరచూ ఉద్యోగాలు మార్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఉన్న ఉద్యోగాల్ని వదిలేసి కొత్త వాటిపైపు పరుగులు తీస్తున్నారు. ఆకర్షణనీయమైన జీతం, ఇతర సదుపాయాలు దొరికితే చాలు ఎంత పెద్ద ఉద్యోగాన్ని అయినా వదిలేసి పరుగులు పెడుతున్నారు. ఇందులో జెన్ జీ ముందు వరుసలో ఉన్నారు. ఇలాంటి వారిపై తీవ్ర విమర్శలు తప్పడం లేదు.
ఉద్యోగాాలు మారడం తప్పు కాదు-అనుపమ్ మిట్టల్ (anupam mittal)
అయితే ఇలా తరచూ ఉద్యోగాలు మారుతున్న జెన్ జీని తప్పుబడుతూ కొందరు కెరీర్ గురూస్ చేస్తున్న వ్యాఖ్యలపై షార్క్ ట్యాంక్ ఇండియా కార్యక్రమానికి జడ్డిగా వ్యవహరిస్తున్న షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ (anupam mittal) తీవ్రంగా స్పందించాడు. తరచుగా ఉద్యోగాలు మారే జెన్ జీ యువతను విమర్శించడం ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. ఎందుకంటే కెరీర్ ప్రారంభ దశలు అన్వేషణకు ఉద్దేశించినవని, దీర్ఘకాలికంగా ఉండిపోవడానికి కాదని తాజా లింక్డ్ ఇన్ పోస్టులో తేల్చిచెప్పేశాడు.

20 ఏళ్ల పైన యూత్ కు కెరీర్ టిప్స్
ప్రతి సంవత్సరం ఉద్యోగాలు మారే 22 ఏళ్ల యువతను చాలా మంది కెరీర్ గురువులు విమర్శిస్తున్నారని, కానీ యువత చేయాల్సిన పని ఇదే కదా? అని అన్నారు. యువ నిపుణులు తమకి ఏది సరైనదో తెలుసుకోవడానికి పరిశ్రమలు, పాత్రలు, సంస్కృతులకు డేటింగ్ చేస్తున్నారని వివరించారు. కెరీర్ వృద్ధికి స్పష్టమైన వ్యూహాన్ని వివరించాడు. 21-24 సంవత్సరాల మధ్య యువత ఎక్కువగా అన్వేషించాలని, అవసరమైతే ఉద్యోగాలు మారుతూ తమ అభిరుచిని కనుగొనాలని సూచించారు.

సెటిల్ కావాల్సిన వయస్సు ఇదే
మీరు నచ్చని దానిని చేయలేకపోతుంటే, ముందుకు సాగిపోవాలని, దాని గురించి బాధపడొద్దని సూచించాడు. ఇది అన్వేషించడానికి సరైన సమయం అన్నాడు. అయితే, 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక మార్గాన్ని కనుగొని, దానిలో స్థిరపడాలని మిట్టల్ సలహా ఇచ్చాడు. ఈ దశలో కనీసం నాలుగు సంవత్సరాలు ఒక కంపెనీకి కట్టుబడి ఉండటం వల్ల అనుభవం, నిగ్రహం పెరుగుతాయన్నాడు. సీనియర్ నాయకత్వ పదవులకు నియామకం చేసేటప్పుడు, కనీసం 4-5 సంవత్సరాల పాటు ఒకే చోట పనిచేసిన అనుభవం లేని బయోడేటాలను తాను ఎప్పుడూ తిరస్కరిస్తానని తెలిపాడు. మొదటి సంవత్సరం మీరు నేర్చుకుంటారు, రెండవ సంవత్సరం అమలు చేస్తారు, మూడవ సంవత్సరం మీరు రెండవ సంవత్సరంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని, విజయాలను విస్తరింపజేస్తారన్నాడు.












Click it and Unblock the Notifications