తెలంగాణలో నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల.. ఏటా రెండు సార్లు..
టెట్ అభ్యర్థులకు శుభవార్త.. తెలంగాణ రాష్ట్రంలో నేడు టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ సోమవారం జారీ కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. సంవత్సరంలో రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇక, ఈ ఏడాది మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు సిబిటి విధానంలో నిర్వహించారు. రెండోసారి టెట్ నిర్వహణకు నేడు నోటిఫికేషన్ జారీచేయనున్నారు. జనవరిలో టెట్ పరీక్షలు జరుపుతామని గత ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోమవారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.

ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన టెట్ పరీక్షలకు దాదాపు 2.35 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 1.09 లక్షల మంది అర్హత సాధించారు. డీఎస్‌సీ కూడా ముగిసినందున టెట్ పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. సిబిటి విధానంలో పరీక్షలు జరగడం వల్ల కనీసం వారం పది రోజులపాటు స్లాట్లు దొరకాల్సి ఉంటుంది. అందువల్ల టెట్ పరీక్షలు సంక్రాంతి లోపా? ఆ తర్వాతా? అన్నది తెలియాల్సి ఉంది.
పరీక్ష అర్హతలు..
టెట్ పేపర్-1 పరీక్ష రాసేవారు డీఈడీ అర్హత ఉండాలి. పేపర్-2 పరీక్ష రాసేవారు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత తప్పినసరి అనడంతో వేలాది మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్షకు హాజరుకానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు టెట్ పరీక్షలు జరిగాయి. ఇక, జనవరిలో పదోసారి జరగనుంది. రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి గత మే నెల టెట్ పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు ఈ పరీక్షలను నిర్వహించారు.












Click it and Unblock the Notifications