నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్..అభ్యర్థులకు ఏపీపీఎస్సీ హెచ్చరిక..
ఆంధ్రప్రదేశ్‌లో నేడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. మొత్తం 81 పోస్టులకు గాను గత నెలలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష రెండు సెషన్‌లలో జరగనుంది. ఉదయం సెషన్‌లో పేపర్ 1 పరీక్ష ఉండనుంది. పేపర్ 1 ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది. ఇక, రెండో సెషన్‌లో పేపర్ 2 పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4 వరకూ పేపర్-2 పరీక్షను నిర్వహిస్తారు. గ్రూప్ 1 పరీక్షకు రాష్ట్రంలోని 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది.
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పెన్ను పేపర్ విధానంలో ఉంటుంది. మొత్తం 240 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తారు. ప్రిలిమ్స్ పేపర్-1లో మొత్తం 120 ప్రశ్నలు, 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇక, పేపర్-2లో 120 మార్కులకు గాను 120 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో పేపర్ కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1లో పార్ట్ -ఏ, పార్ట్-బి, పార్ట్- సి, పార్ట్ - డి విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏలో హిస్టరీ అండ్ కల్చర్, పార్ట్-బిలో రాజ్యాంగం, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పార్ట్-సిలో ఏపీ, ఇండినయ్ ఎకానమీ, ప్లానింగ్, పార్ట్-డిలో జాగ్రఫి నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్...
ఇక, ఈ పరీక్షలపై సీఎస్ జవహర్ రెడ్డి ఏపీపీఎస్సీ అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ విధించారు. అక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు. ప్రతీ ఎగ్జామ్ సెంటర్ వద్ద ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా పోలీసులతో పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు.
పరీక్ష తర్వాత ఆన్సర్ సీట్లను పూర్తి బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ లకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో లోపలికి ప్రవేశించరాదని, ఏపీపీఎస్సీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications