టీటీడీలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్: వెల్లడించిన బీఆర్ నాయుడు
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి త్వరలోనే చర్యలను తీసుకుంటామని టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు. దీనిపై కసరత్తు మొదలు పెట్టనున్నామని, ఇందులో భాగంగా భర్తీకి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు.
తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ గ్రౌండ్స్‌లో ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ పోటీల్లో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్ వంటివి ఉన్నాయి.

పరేడ్ మైదానంతో పాటు రిక్రియేషన్ హాల్, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ మైదానం, ఎస్వీ జూనియర్ కాలేజీ, ఎస్వీ హైస్కూల్ ఎస్వీ యూనివర్శిటీ, ఎస్వీ అగ్రికల్చర్, వెటనరీ యూనివర్శిటీ మైదానాలలో ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహిస్తారు. వీటిని ప్రారంభించిన అనంతరం ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడారు.
టీటీడీ ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో రాణించాలని, విజేతలుగా నిలవాలని ఆకాక్షించారు. వచ్చే ఏడాది నాటికి పటిష్ట జట్లను తయారు చేయాలని సూచించారు. ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారని బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు.
టీటీడీ ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, వారి మానసిక వికాసం కోసం 1977వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈఓ జే శ్యామలరావు మాట్లాడుతూ- తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది భక్తులకు ఉద్యోగులు విశేష సేవలు అందిస్తున్నారని, ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుందని, వాటిని నియంత్రించడం క్రీడల ద్వారానే సాధ్యమౌతుందని అన్నారు.
టీటీడీ ఉద్యోగులు సమష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతీ బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమిని విజయవంతం చేశారని అభినందించారు. టీటీడీ ఉద్యోగుల్లో క్రీడా స్పూర్తి, స్నేహపూర్వక వాతావరణం, సమష్టి కృషి, మనోదైర్యం కోసం క్రీడలు చాలా ఉపయోగపడతాయని శ్యామలరావు వివరించారు.
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు - టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు
— B R Naidu (@BollineniRNaidu) February 28, 2025
• ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభం
టిటిడిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిటిడి చైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు… pic.twitter.com/xm9xv3IUQB
ప్రతి రోజు ఉద్యోగులు క్రీడల్లో భాగస్వాములు కావడం వల్ల వారిలో క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం, శారీరక దృఢంగా ఉంటారని, అందుకే ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ పోటీల్లో మొదటి స్థానం గెలుచుకున్న వారికి రూ.2,000, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.1,800/, మూడో స్థానంలో నిలిచినవారికి రూ.1,600 విలువ గల బ్యాంకు గిఫ్ట్‌కార్డులు బహుమతులు అందజేస్తామన్నారు.
అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వృత్తిలో మెరుగైన, ఉత్పాదక సేవలు అందించాలని కోరారు. క్రీడల ద్వారా ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు పునరుత్తేజం కలుగుతుందని చెప్పారు. టీటీడీలో ప్రతి ఒక్కరూ ఒత్తిళ్లను నియంత్రించుకుని, భావోద్వేకానికి గురికాకుండా క్రీడా స్పూర్తితో భక్తులకు మరింతగా సేవలు అందించాలని సూచించారు.












Click it and Unblock the Notifications