TTD: మీ పిల్లలను బాలమందిరంలో చేర్పించాలనుకుంటున్నారా? అడ్మిషన్లు షురూ
నిరుపేద అనాథ పిల్లల సంరక్షణ, విద్య కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తన నిరంతర నిబద్ధతను చాటుకుంటోంది. తిరుపతిలోని ప్రసిద్ధ 'ఎస్.వి. బాలమందిరం'లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అనాథ పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి టీటీడీ ఈ కేంద్రం ద్వారా భరోసా కల్పిస్తోంది.
తిరుమల శ్రీవారికి వచ్చే కానుకలను కేవలం ధార్మిక కార్యక్రమాలకే కాకుండా, సామాజిక సేవకు కూడా వినియోగించాలనే గొప్ప సంకల్పంతో టీటీడీ ఈ సంస్థను స్థాపించింది. ఎస్వీ బాలమందిరం 1943వ సంవత్సరంలో స్థాపించారు. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు (ముఖ్యంగా హిందూ మతానికి చెందినవారికి) ఆశ్రయం కల్పించి, వారికి నాణ్యమైన విద్య, క్రమశిక్షణ,ఉజ్వల భవిష్యత్తును అందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. లమందిరంలో ప్రవేశం పొందిన పిల్లలకు వసతి, భోజనం, దుస్తులు,వైద్య సదుపాయాలను టీటీడీ పూర్తిగా ఉచితంగా కల్పిస్తుంది. పిల్లలకు పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

ఇక్కడ చేరిన పిల్లలకు ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు టీటీడీ విద్యాసంస్థల్లోనే చదువుకునే అవకాశం కల్పిస్తారు. వలం పాఠ్యపుస్తక చదువులే కాకుండా, పిల్లల్లోని ప్రతిభను గుర్తించి సంగీతం, నృత్యం, కుట్టుపని, తర వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇస్తారు. డిగ్రీ లేదా పీజీ చదవాలనుకునే విద్యార్థులకు కూడా టీటీడీ తన కళాశాలల్లో అవకాశం కల్పిస్తుంది. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సులు (ఇంజనీరింగ్, మెడిసిన్ వంటివి) సాధిస్తే, వారికి కూడా ఆర్థికంగా అండగా నిలుస్తుంది.
ఆడపిల్లల చదువు నుంచి వివాహం దాకా...
బాలమందిరంలో పెరిగిన ఆడపిల్లల చదువు పూర్తయ్యాక, వారికి వివాహం చేసే బాధ్యతను కూడా టీటీడీ స్వీకరిస్తుంది. అలాగే, ఇక్కడ పెరిగిన పిల్లలకు టీటీడీలో ఖాళీలను బట్టి అర్హతను అనుసరించి ఉద్యోగ అవకాశాల్లో కొంత ప్రాధాన్యత లేదా సహకారం లభిస్తుంది.
ప్రస్తుతం తిరుపతిలోని భవానీ నగర్‌లో ఉన్న ఈ కేంద్రం, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అనాథ పిల్లలకు ఒక పెద్ద కుటుంబంలా అండగా నిలుస్తోంది. మే 16, 2026 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున, అర్హులైన నిరుపేద అనాథ పిల్లలకు ఈ సమాచారాన్ని చేరవేయడం ఎంతో పుణ్యకార్యం.
ప్రవేశానికి ఉండాల్సిన అర్హతలు..
- మతం: దరఖాస్తు చేసుకునే పిల్లలు తప్పనిసరిగా హిందూ మతానికి చెందినవారై ఉండాలి.
- వయస్సు: ఏప్రిల్ 27, 2026 నాటికి పిల్లల వయస్సు 05 సంవత్సరాలకు పైబడి, 10 సంవత్సరాల లోపు ఉండాలి.
- స్థితి: తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
దరఖాస్తు ప్రక్రియ - కావలసిన పత్రాలు:
దరఖాస్తు ఫారాలను ఎస్వీ బాలమందిరం నుంచి నేరుగా పొందవచ్చు.. లేదా తెల్ల కాగితంపై వివరాలు రాసి కూడా సమర్పించవచ్చు. దరఖాస్తుతో పాటు ఈ క్రింది పత్రాలను జతచేయాల్సి ఉంటుంది:
- తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రాలు (Death Certificates).
- పిల్లల పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (Birth Certificate).
- కుల ధృవీకరణ పత్రం (Caste Certificate).
- ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate).
- ఇతర అవసరమైన ఆధార పత్రాలు.
గడువు - చిరునామా:
పూర్తి చేసిన దరఖాస్తులను మే 16, 2026 సాయంత్రం 05:00 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది.
- చిరునామా: [AEO, SV. బాలమందిర్], టి.టి.డి, భవానీ నగర్, తిరుపతి.
- సమర్పణ విధానం: దరఖాస్తులను నేరుగా స్వయంగా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ పైన పేర్కొన్న చిరునామాకు పంపవచ్చు.
మరింత సమాచారం కోసం టీటీడీ హెల్ప్‌లైన్ నంబర్ 0877-2264613 ను సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications