AI ఉద్యోగాల్ని తీసేయట్లేదు- ఇలా మారుస్తోంది..! ఐఐటీ మద్రాస్ షాకింగ్ రిపోర్ట్..!
ప్రపంచవ్యాప్తంగా ఏఐ (AI) దూకుడు కొనసాగుతోంది. దీని ప్రభావం భారత్ పైనా తీవ్రంగానే ఉంది. ముఖ్యంగా ఏఐ, ఆటోమేషన్ ల రాకతో ఉద్యోగాల కోతలు పెరిగిపోతున్నాయన్న ఆందోళన ఇప్పుడు కోట్లాది ఉద్యోగుల్లో పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టుగానే కంపెనీలు ఏఐపై భారీ ఎత్తున ఖర్చుపెడుతూ, ఉద్యోగుల కోతలతో దాన్ని భర్తీ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు నిజంగానే ఏఐ ఉద్యోగాల కోతలకు కారణమవుతుందా, కంపెనీల్లో అసలు ఏం జరుగుతుందో ఐఐటీ మద్రాస్ తన తాజా అధ్యయన నివేదికలో వెల్లడించింది.
ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయా ? (AI)
ఏఐ వల్ల అన్ని ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయా? లేక ఉద్యోగాల్లోని కొన్ని పనులు మాత్రమే ఆటోమేషన్ పరిధిలోకి వస్తాయా? వంటి అంశాలపై ఐఐటీ మద్రాస్‌కు చెందిన సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ ఏఐ (CeRAI) రూపొందించిన "How AI Is Reconfiguring Work in India" అనే శ్వేతపత్రం పలు కీలక విషయాలను చర్చించింది. ఇందులో చెన్నైకి చెందిన ఓ బీపీఓలో పనిచేస్తున్న ఉద్యోగుల ఉదాహరణ ప్రస్తావించింది. సదరు సంస్థలో పనిచేసే ఉద్యోగి పాస్వర్డ్ రీసెట్ చేయడం, ఖాతా బ్యాలెన్స్ వంటి సాధారణ వివరాలు అందించడం, డాక్టర్ అపాయింట్మెంట్ నమోదు చేయడం వంటి పనులను ఇప్పటికే వాయిస్ బాట్లు నిర్వహిస్తున్నాయి. అయితే ఒకేసారి అనేక సమస్యలతో ఫోన్ చేసే వినియోగదారులకు సహాయం చేయడం, క్లిష్టమైన ఫిర్యాదులను పరిష్కరించడం వంటి పనులకు ఇప్పటికీ ఉద్యోగుల అవసరం ఉంటోంది. అంటే ఉద్యోగం పూర్తిగా కనుమరుగవడం కాకుండా, అందులో నిర్వహించాల్సిన పనుల స్వరూపం మారుతోందని తేల్చింది.

ఐఐటీ మద్రాస్ అధ్యయనంలో వాస్తవాలు (IIT Madras)
ఐఐటీ మద్రాస్ అధ్యయనం ప్రకారం.. ఒక ఉద్యోగంలో ఉండే అన్ని పనులను ఏఐతో చేయించడం సాధ్యం కాదు. ఏఐ ప్రభావం ఆయా పనుల స్వభావం, పరిశ్రమ, నియంత్రణ నిబంధనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి అయ్యే ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగాలను పూర్తిగా ఒకే యూనిట్‌గా చూడకుండా, వాటిలోని వివిధ పనులను విడివిడిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. ఉదాహరణకు కస్టమర్ సర్వీస్ ఉద్యోగులు సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం తగ్గవచ్చు. జూనియర్ అకౌంటెంట్లు ఇన్వాయిస్ల నమోదుకు వెచ్చించే సమయాన్ని తగ్గించుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు గతంలో ప్రారంభ దశలో స్వయంగా రాసే కోడ్‌లో ఎక్కువ భాగాన్ని ఏఐ సహాయంతో తయారు చేసుకోవచ్చు. కాబట్టి తక్కువ ఖర్చుతో సేవలు అందించే వ్యాపార రంగాల్లో ఏఐ వాడే అవకాశాలు పెరుగుతున్నాయి. సాధారణ బీపీఓ కాల్స్, జీఎస్టీ అకౌంటింగ్, ఇన్వాయిస్ ప్రాసెసింగ్, తయారీ రంగంలో ఉత్పత్తుల నాణ్యత తనిఖీ వంటి పనులను ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ వ్యవస్థలతో ఆటోమేట్ చేయవచ్చు.

ఉద్యోగాల తీరు మారుతోంది
ఉద్యోగాల్లో మార్పులు వచ్చినప్పుడు కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారిపై వాటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోంది. ఎందుకంటే ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో రిపీట్ పనులు ఎక్కువగా ఉంటాయి. ఆ పనుల ద్వారానే ఉద్యోగులు అనుభవం సంపాదించి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. సీనియర్ స్థాయికి ఎదగడానికి అవసరమైన ప్రాథమిక పనులనే ఏఐ నిర్వహిస్తే, కొత్త ఉద్యోగులు అనుభవాన్ని ఎలా సంపాదిస్తారన్నది ఇక్కడ ప్రశ్న. ఈ పరిస్థితిలో ఉద్యోగుల బాధ్యతలు మారవచ్చు. ఏఐ ఇచ్చిన ఫలితాలను చెక్ చేయడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం, ఏఐ వ్యవస్థల పనితీరును అంచనా వేయడం వంటి పనులు ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో భాగం కావచ్చు. అలాగే ఏఐ విస్తరణతో ట్రైనర్లు, చాట్‌బాట్ చాటింగ్ రూపకర్తలు, క్లిష్టమైన ఫిర్యాదులను పరిష్కరించే నిపుణులు, రోబోట్ ఆపరేటర్లు వంటి పాత్రలకు అవకాశాలు పెరగవచ్చు. నీతీ ఆయోగ్ అంచనాల ప్రకారం, రాబోయే ఐదేళ్లలో ఏఐ రంగంలో 40 లక్షల కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈ అవకాశాలు ఉద్యోగాలుగా మారాలంటే నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు అమలు చేయాలి. అలాగే ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు, దాని వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులకు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని అధ్యయనం గుర్తుచేస్తోంది.














Click it and Unblock the Notifications
