లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! (వీడియో)
దుబాయ్ వీధుల్లో ప్రముఖ నటి, మోడల్ ఖుషీ ముఖర్జీకి చేదు అనుభవం ఎదురైంది. తనకు ఎదురైన భయానక అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఆమెను చెంపదెబ్బ కొట్టి పారిపోవడంతో, ఆమె కన్నీరుమున్నీరవుతూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. రాత్రి పూట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక వ్యక్తి తనను కొట్టి పారిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే?
నటి ఖుషీ ముఖర్జీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో తీవ్రంగా ఏడుస్తూ కనిపించారు. "రాత్రి 9 గంటల సమయం అవుతోంది. నేను రోడ్డుపై నడుస్తుండగా.. బైక్‌పై వచ్చిన ఒక వ్యక్తి నా చెంపదెబ్బ కొట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ రోడ్లపై కెమెరాలు కూడా లేవు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఏం లాభం? ఎవరో నా వెంట పడుతున్నట్లు అనిపిస్తోంది" అని ఆమె తన ఆవేదనను వెళ్లగక్కారు. వీడియోలో ఆమె పదేపదే వెనక్కి తిరిగి చూస్తూ భయంతో వేగంగా నడవడం కనిపిస్తోంది.

పోలీసుల తీరుపై అసహనం
ఈ ఘటనపై ఖుషీ స్పందిస్తూ.. "కొందరు వ్యక్తులు పాత కక్షలను మనసులో పెట్టుకొని నన్ను టార్గెట్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద నేను ఒక్కదాన్నే పోరాడుతున్నట్లు అనిపిస్తోంది. పోలీసులు కూడా సహాయం చేయడం లేదు. పోలీస్ స్టేషన్ ఖాళీగా ఉంది, మహిళా అధికారులు కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. దుబాయ్ కూడా మిగిలిన ప్రాంతాల కంటే భిన్నంగా ఏమీ లేదు. ప్రపంచం మొత్తం షరియా చట్టాలను అనుసరించమని మనల్ని ఒత్తిడి చేస్తున్నట్లు ఉంది" అని ఖుషీ ముఖర్జీ రాసుకొచ్చారు.
వివాదాల నేపథ్యంలో దాడి
ఖుషీ ముఖర్జీ ధరించే దుస్తుల విషయంలో తరచుగా వివాదాలు తలెత్తుతుంటాయి. ఇటీవల ర్యాపర్ శాంటీ శర్మ ఆమె దుస్తులపై విమర్శలు చేస్తూ.. ఇలాంటి వారి వల్లే నేరాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ విమర్శల నేపథ్యంలోనే ఆమెపై దాడి జరగడం చర్చనీయాంశమైంది. నెటిజన్లు ఈ వీడియోపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు ఇది పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు.
ఎవరీ ఖుషీ ముఖర్జీ?
ఖుషీ ముఖర్జీ టెలివిజన్ నటిగా, మోడల్‌గా గుర్తింపు పొందారు. ప్రముఖ రియాలిటీ షో 'స్ప్లిట్స్‌విల్లా'లో ఖుషీ ముఖర్జీ పాల్గొన్నారు. 'బాల్వీర్', 'రీతి రివాజ్', 'నాదాన్' వంటి సిరీస్‌లలో నటించారు. 2013లో 'అంజల్ తురై' అనే తమిళ చిత్రంతో పాటు 'శృంగార్' అనే హిందీ సినిమాలో నటించారు. అంతేకాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ఆమె కొన్ని సినిమాల్లో మెరిశారు. దుబాయ్ వంటి సురక్షితమైన నగరంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఖుషీ ముఖర్జీ ఆరోపించినట్లుగా ఇది పాత కక్షల వల్ల జరిగిందా లేదా అన్నది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications