జూనియర్ ఆర్టిస్టుల పొట్టగొట్టిన ఏఐ.. ఇప్పటికే బాలీవుడ్‌లోకి ఎంట్రీ?
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటులకు మొదటి అవకాశం ఓ గుంపులో నిలబడటంతోనే ప్రారంభమైంది. మిథున్ చక్రవర్తి, నవాజుద్దీన్ సిద్దిఖీ. పంకజ్ త్రివాఠి, మిహిర్ అహుజా వంటి నటులు ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు లేదా జూనియర్ ఆర్టిస్టులుగానే తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 'బాహుబలి' సినిమాలో మహిష్మతి రాజ్యంలో ఓ సాధారణ మహిళగా కనిపించి ఆ తర్వాత పుష్ప, సలార్ వంటి చిత్రాల్లో మంచి పాత్రలు దక్కించుకున్న కల్పలత జర్నీ కూడా అలాంటిదే. అయితే ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ముంబై లేదా హైదరాబాద్ చేరుకునే వేలాది మంది వర్థమాన నటులకు జూనియర్ ఆర్టిస్ట్ జాబ్ ఓ ఆసరాగా నిలుస్తోంది.
కానీ మోడ్రన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ కారణంగా ఈ పరిస్థితి మారుతోంది. ప్రస్తుతం 'రామాయణ', 'కాంతార 2', 'బోర్డర్ 2' వంటి భారీ సినిమాల్లో జనం గుంపులుగా నిలబడి ఉండే సీన్లను చూపించడానికి ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), వీఎఫ్ఎక్స్ విరివిగా ఉపయోగిస్తున్నారు. దాదాపు 100 కంటే ఎక్కువ మంది అవసరమయ్యే సీన్లలో కేవలం 20 శాతం మంది నిజమైన ఆర్టిస్టులను తీసుకుని మిగిలిన 80 శాతం మందిని డిజటల్‌గా సృష్టిస్తున్నారు.

ఏఐ ఎందుకు ప్రతిపాదించబడుతోంది?
వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులను సెట్‌లోకి తీసుకురావడం.. వారికి రవాణా, ఆహారం మేకప్, కాస్ట్యూమ్స్ కేటాయించడం చాలా ఖరీదైన పని. ఏఐ ద్వారా ఈ ఖర్చులను భారీగా తగ్గించవచ్చు. కొంత మంది నిజమైన నటుల ముఖకవళికలు, శరీర సౌష్టవాన్ని 3డీ స్కాన్ చేసి.. వారినే వందలాది డిజిటల్ మనుషులుగా చూపిస్తున్నారు.
జూనియర్ ఆర్టిస్టుల్లో ఆందోళన
ఈ సాంకేతిక మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ మనుషుల భావోద్వేగాలను పండించలేదన.. నాకేం ఏఐ గురించి భయం లేదని నటుడు మిహిర్ ఆహుజా పేర్కొన్నారు. కానీ ప్రధాన నటుల కంటే రోజువారీ వేతనంపై ఆధారపడి జీవించే సాధారణ జూనియర్ ఆర్టిస్టుల ఉపాధి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఒకసారి నటుడి డిజిటల్ రూపం స్కాన్ చేసిన తర్వాత దానిపై హక్కులు ఎవరికి ఉంటాయనే వివాదం కూడా మొదలవుతోంది.
ఏఐ కెమెరాకు దూరంగా ఉన్న గుంపులను సృష్టించడానికి మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తుందని వీఎఫ్ఎక్స్ నిపుణుడు శ్రీనివాస్ మోహన్ వెల్లడించారు. కెమెరాకు దగ్గరగా ఉండే క్లోజప్ షాట్లలో నిజమైన నటులు తప్పని సరి అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన 'ది ఒడిస్సీ' సినిమా కోసం ఏకంగా 2 వేల మందికి పైగా నిజమైన ఆర్టిస్టులను ఉపయోగిస్తూ.. టెక్నాలజీ కంటే నటీనటుల సహజత్వానికే ప్రాధాన్యత ఇచ్చారు.
కానీ ఆర్థికంగా ఖర్చులను తగ్గించుకోవడం కోసం భారతీయ చిత్ర పరిశ్రమలో గుంపు సీన్ల కోసం జూనియర్ ఆర్టిస్టుల సంఖ్య క్రమంగా తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీ రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ.. సాధారణ కళాకారుడు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించే మొదటి తలుపు చిన్నదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.













Click it and Unblock the Notifications